ఉచిత బస్సు ప్రయాణంతో దివ్యాంగులకు అండ – మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Minister Kondapalli Srinivas Launches "Divyang Shakti" Scheme
Minister Kondapalli Srinivas: రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమం,వారి సామాజిక, ఆర్థిక ఎదుగుదల కోసంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “దివ్యాంగ శక్తి” పథకం బుధవారం విజయనగరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే ఈ కార్యక్రమాన్ని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి ప్రారంభించారు. అనంతరం, దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు.మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దివ్యాంగుల కోసం గతంలో ఉన్న రాయితీలను పెంచుతూ, ఇప్పుడు ఐదు రకాల బస్సుల్లో (పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ మరియు సిటీ బస్సుల్లో) 100% ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు.

Minister Kondapalli Srinivas: ఏసీ – ప్రీమియం బస్సుల్లో ప్రయాణించే దివ్యాంగులకు 50% రాయితీ కొనసాగుతుందని… దివ్యాంగుల సహాయార్థం వచ్చే వారికి కూడా నిబంధనల మేరకు అన్ని రకాల బస్సుల్లో 50% రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దివ్యాంగుల ఆర్థిక భరోసా కోసం పెన్షన్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం గణనీయంగా పెంచిందని.. మూడువేల రూపాయలు గల పెన్షన్ ఆరు వేల రూపాయలకు పెంచిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. జిల్లాలో సుమారు 30,000 మంది దివ్యాంగులు ఉండగా, ప్రస్తుతం 1,200 మంది మాత్రమే బస్సు పాస్‌లు కలిగి ఉన్నారని, మిగిలిన వారందరూ సదరం సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డు ద్వారా ఆర్టీసీ కాంప్లెక్స్‌లలో పాస్‌లు పొందాలని సూచించారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’ పథకం ఎంత విజయవంతమైందో, అదే స్ఫూర్తితో ‘దివ్యాంగ శక్తి’ కూడా దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. బస్సులలో దివ్యాంగులకు కేటాయించిన సీట్లు వారికి అందుబాటులో ఉండేలా సిబ్బంది, ప్రజలు సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతి రాజు,ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు కార్పొరేషన్ ఛైర్పర్సన్ పాలవలస యశస్వి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ, కూటమి పార్టీల ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్థానిక శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతి రాజు మాట్లాడుతూ… దివ్యాంగులకు దేశంలోనే అత్యధిక మొత్తం పెన్షన్ అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. దివ్యాంగులకు ఆర్దిక భరోసా కల్పించడమే కాకుండా వారికి విద్యా ఉపాధి రంగాల్లో అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారన్నారు. అవసరమైన వారికి బస్సు పాసులు అందించే ఉద్దేశంతో మూడు రోజులపాటు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని దివ్యాంగులు అందరూ వినియోగించుకోవాలని తెలిపారు.
జిల్లా ప్రజా రవాణా అధికారిణి జి. వరలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 1200 మంది దివ్యాంగులు బస్సు పాసులు కలిగి ఉన్నారని, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం 40 శాతం వైకల్యం కలిగిన వారికి కూడా కల్పిస్తున్నందున మరింత ఎక్కువ మందికి ఈ పథకం ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అర్హులైన దివ్యాంగులు అందరూ బస్సు పాసులు పొందాలని, బస్సు పాసు మూడు సంవత్సరాల గడువుతో అందజేయడం జరుగుతుందని తెలిపారు. బస్సులలో దివ్యాంగులకు కేటాయించిన సీట్లలో వారు కూర్చొనేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
Also Read: కూటమి పాలనలో ప్రాణాంతకంగా పాలు, నీరు – చిన్న శ్రీను
