రైతులను దగా చేస్తోన్న కూటమి ప్రభుత్వం – మజ్జి శ్రీనివాసరావు

ZP Chairperson and YCP District President Majji Srinivasa Rao

ZP Chairperson and YCP District President Majji Srinivasa Rao

Chinna Srinu slams government: కూటమి ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని, అన్నదాత సుఖీభవ పథకంలో రైతులను భారీగా వంచన చేసిందని విలేకర్ల సమావేశంలో జెడ్పీ ఛైర్పర్సన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి వైసీపీ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) ధ్వజం ఎత్తారు. రెండేళ్లకు గానూ, ప్రతీ రైతుకి రూ.40 వేలకు బదులు, మూడు విడతల్లో రూ.14 వేలుతో చంద్రబాబు సరిపెట్టారని అన్నారు. ఇక జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేక, కనీస మద్దతు ధర లభించక, మొక్కజొన్న రైతులు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాలో గ్యాస్ కొరతను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ధర్మపురిలోని తన క్యాంప్ ఆఫీసులో విలేకర్ల సమావేశంలో చిన్న శ్రీను పలు అంశాలపై మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగట్టారు.దేశానికి వెన్నుముక లాంటి రైతన్న ఈ రాష్ట్రంలో అనేక సమస్యలతో గగ్గోలు పెడుతున్నా, వారిని ఆదుకోవాలన్న చిత్తశుద్ధి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు దేశం పార్టీకి లేదని చిన్నశ్రీను ఎద్దేవా చేశారు. రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. రైతుల పక్షాన మాట్లాడేందుకు ఈ కూటమిలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ ముందుకు రావడం లేదని అవేదన వ్యక్తం చేశారు. కూటమి నేతలకు ఎల్లప్పుడూ ప్రకటనలు, ప్రచారాలు తప్ప రైతుల గోడు పట్టదని విమర్శించారు. కేంద్రంతో సంబంధం లేకుండా, అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతీ రైతుకి రూ.20 వేలు ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు ఆ హమీను నిలబెట్టుకోలేకపోయారని ఆరోపించారు. రెండేళ్లలో ప్రతీ రైతుకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, మూడో విడతతో కలిపి కేవలం రూ.14 వేలు మాత్రమే వేసి కూటమి ప్రభుత్వం వారిని దగా చేసిందని దుయ్యబట్టారు. కూటమి పాలకులు రైతు పండగలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు, కానీ ఎక్కడా ఏ ఒక్క రైతు సంతోషంగా లేరన్న వాస్తవాన్ని వారు గ్రహించుకోవాలని సూచించారు

Chinna Srinu slams government: ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో, ముఖ్యంగా విజయనగరం (Vizianagaram) జిల్లాలో వరి తర్వాత ప్రధానమైన పంటగా మొక్కజొన్న పండించే రైతులు ఈ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వలన దళారీల బారిన పడి దగా పడుతున్నారన్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు. జిల్లాలో దాదాపు 50 హెక్టార్లలో మొక్క జొన్న సాగు చేస్తున్నారని, దీనివల్ల దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుందన్నారు. ఐతే ఇప్పటికే ఇరవై శాతం వరకు కోతలు పూర్తి కాగా, మరో పదిహేను రోజుల్లో వంద శాతం పంట కోతలు పూర్తి అవుతాయని తెలిపారు. కానీ కేంద్రం ప్రకటించిన రూ.2400 కనీస మద్దతు ధరకు మొక్క జొన్నను కొనుగోలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. దళారీలు, కార్పోరేట్ వ్యాపారులు మొక్క జొన్న రైతులను దగా చేస్తూ క్వింటాకు కేవలం రూ.1600 లే ధర చెల్లిస్తున్నారని తెలిపారు. కొనుగోళ్లు కేంద్రాలు లేక, వేరే ప్రత్యామ్నాయం లేక, రైతులు తమ పంటను దాచుకునే అవకాశం లేక క్వింటా దగ్గర రూ.800 వరకు నష్టపోతూ దళారీలకు అమ్ముకుంటున్నారని చిన్న శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న రైతులు దగా పడుతున్నా ఈ ప్రభుత్వానికి చలనం లేదు, ఒక ప్రకటన కూడా లేదని ఎద్దేవా చేశారు. ఏ ఒక్క రైతైనా, ఎక్కడైనా సంతోషంగా ఉన్నారో లేదో రైతు పండగ అంటూ గ్రామాలకు వెళ్తున్న ఈ జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఆర్థికంగా కుదేలైపోయిన రైతులను కూటమి పాలకులు ఆదుకోవాలని కోరారు. తక్షణమే ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని చిన్నశ్రీను అభ్యర్థించారు. రైతులకు కనీస మద్దతు ధర అందేలా ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించాలని చిన్నశ్రీను డిమాండ్ చేశారు. రైతులకి సహకార బ్యాంకులు అప్పులు ఇచ్చే పరిస్తితి కూడా ఎక్కడా లేదని, అసలు లీడ్ బ్యాంకు మేనేజర్లతో సమీక్షలు చేసి రైతుల రుణాల కోసం మాట్లాడే ప్రజాప్రతినిధులే ఈ జిల్లాలో లేరని విమర్శించారు. ఈ జిల్లాలో అధికారులు మొదలు మంత్రులు వరకు ఎవరూ రైతుల పక్షాన ప్రభుత్వం వద్ద కనీసం నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు. అసలు రైతు సమస్యలపైనే ఈ ప్రభుత్వం స్పందించదని అన్నారు. ఇదీ ఈ జిల్లాలో రైతుల దీనస్థితి అని చిన్న శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు.

Chinna Srinu slams government: గ్యాస్ దొరకక హోటళ్లు, చిన్న చిన్న దుకాణాలు మూత పడి ప్రజలు జీవనోపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదిహేను రోజులకు సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని ఒక వైపు మభ్యపెడుతున్న ప్రభుత్వం, మరో వైపు అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ లు కొనుగోలు చేయమని ఆదేశాలు ఇస్తోందని అన్నారు. గ్యాస్ లభ్యతపై వాస్తవ పరిస్థితి ఏమిటో క్షేత్ర స్థాయిలో దానిపై ఎవరూ నోరు మెదపరని అన్నారు. గ్యాస్ కొరతతో ప్రజల కష్టాలు మొదలయ్యాయని, సామాన్య ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యపై వంటలు చేసుకునే పరిస్తితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిద్రపోతున్న ఈ ప్రభుత్వం గ్యాస్ లభ్యత అంశంపై ముందుగా మేల్కోవాలని సూచించారు.ఇక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దైర్యం, దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని చిన్నశ్రీను వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలు మరో ఆరు నెలలు పడుతుంది అంటూ చెప్పిన చంద్రబాబు మాటల్లో ఆ ఎన్నికలు ఎంత దూరం పొడిగిస్తారన్న వాస్తవం స్పష్టమవుతోందన్నారు. ఎన్నికలు జరిగితే ఓడిపోతామన్న భయం చంద్రబాబులో ఉందని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై ఈ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఎద్దేవా చేశారు.ఈ సమావేశంలో పార్టీ పరిశీలకులు నెక్కల నాయుడు బాబు, కేవీ సూర్యనారాయణ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇప్పిలి అనంత్, గొర్లె రవికుమార్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పి జైహింద్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి కనకల రఘురామ్, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Also Read: ఉచిత బస్సు ప్రయాణంతో దివ్యాంగులకు అండ – మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *