Home Minister Expresses Anger at Officials

Home Minister Expresses Anger at Officials

అధికారులపై రాష్ట్ర హోం శాఖమంత్రి, విజయనగరం జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సంతృప్తిని దృష్టిలో ఉంచుకుని పరిపాలన కొనసాగించాల్సిన అవసరం ఉందని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ పరమైన పనులు చేసేటప్పుడు ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, వారికి ముందుగానే సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దీన్ని ప్రజా ప్రతినిధుల పెత్తనంగా భావించవద్దని, అది వారి బాధ్యతేనని అధికారులు, సిబ్బందికి స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా ప్రజా ప్రతినిధులను నిలదీస్తారని.. కాలువలు, రహదారులు, తాగునీటి సమస్యలపై స్పందన కోరేది ప్రజా ప్రతినిధుల నుంచేనని చెప్పారు. అందువల్ల ఏ పనుల అమలు అయినా ప్రజా ప్రతినిధుల సమన్వయంతో జరగాలని సూచించారు.ప్రతి వారం నిర్వహించే గ్రీవెన్స్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజల సమస్యలను వినిపిస్తుండగా.. అధికారులు కూడా తమ పనుల ప్రాధాన్యతను ముందుగా నిర్ణయించి, సంబంధిత జాబితాలను ప్రజా ప్రతినిధులతో పంచుకోవాలని సూచించారు. ఇలా చేస్తే సమన్వయం మెరుగుపడి, ప్రజలకు త్వరితగతిన సేవలు అందుతాయని చెప్పారు.

రికార్డుల కోసం పని చేయవద్దు..

పనులు పూర్తి చేశామని కేవలం రికార్డుల కోసం కాకుండా, ప్రజలు సంతృప్తి చెందే విధంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి అనిత అన్నారు. ప్రజా సంతృప్తే మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పరిపాలన సాగించాలని స్పష్టం చేశారు. ఇకపై ఇదే తప్పు పునరావృతమైతే జిల్లా స్థాయి అధికారులైనా వెనుకడుగు వేయకుండా చర్యలు తీసుకుంటామని కఠినంగా హెచ్చరించారు.వేసవి కాలంలో ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, నీటి కలుషితం, డయేరియా వంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కూడా అత్యంత అవసరమని చెప్పారు. మూడు నెలలకు ఒకసారి జరిగే డిఆర్సి సమావేశాలకే పరిమితం కాకుండా.. అవసరమైతే జూమ్ ద్వారా కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఏ శాఖకు సంబంధించిన రివ్యూ మీటింగ్ అయినా తక్షణమే నిర్వహించేందుకు అధికారులు ముందడుగు వేయాలని సూచించారు.

ఈ చర్యల అమలులో అందరూ సహకరించాలని, ప్రజల కోసం బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *