మరో డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం ! అక్టోబర్ 15న నోటిఫికేషన్‌ ?

AP DSC Notification 2026

AP DSC Notification 2026

  • విద్యాశాఖలో ఖాళీలతో ప్రాథమిక జాబితా రూపొందించిన అధికారులు
  • టీచర్ తో పాటు ఎస్‌సీఈఆర్టీ, ఇంటర్మీడియట్, లైబ్రేరియన్‌ పోస్టులకు ప్రకటనలు

AP DSC Notification 2026: ఒకవైపు డీఎస్సీ నియామకాలపై వివాదం కొనసాగుతుండగానే మరో డీఎస్సీ ప్రకటనకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరించింది. యాజమాన్యాల వారీగా ఎన్ని పోస్టులు అవసరమవుతాయన్నది గుర్తించి… ప్రాథమిక జాబితాను రూపొందించింది. డీఎస్సీతోపాటు డైట్, రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ), గ్రంథాలయాల్లో సిబ్బంది నియామకానికి కూడా ప్రకటనలు విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

అక్టోబరు 15న నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం

ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఇప్పటికే విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2026కు సంబంధించిన డీఎస్సీ ప్రకటన విడుదల కానుంది. ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్తులు, పురపాలక, జువనైల్‌ సంక్షేమం, గిరిజన గురుకులాలు, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యా సంస్థలు, ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, దివ్యాంగ, బీసీ సంక్షేమ విద్యా సంస్థల్లో టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అన్ని టీచర్‌ పోస్టులూ కలిపి 2,500కు పైగా భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.

పాఠశాల విద్యలో 2వేలకుపైగా ఖాళీలు

AP DSC Notification 2026: పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా రూపొందించిన జాబితా ప్రకారం పురపాలక, మండల, జిల్లా పరిషత్తులు, ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి 2,250 పోస్టులు ఉండనున్నాయి. ఈ సంఖ్యపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మిగతా అన్ని విభాగాల విద్యా సంస్థలకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ఖాళీల ప్రకారం మూడు వందల వరకు ఉంటాయని అంచనా. డీఎస్సీ పోస్టులే కాకుండా డైట్, ఎస్‌సీఈఆర్టీ లెక్చరర్ల పోస్టులు 160, జూనియర్‌ లెక్చరర్లు 209, లైబ్రేరియన్ల పోస్టులు వంద వరకు ఉండనున్నాయి. వీటిని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.

ప్రతి ఏటా డీఎస్సీ ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినందున 2029 వరకు ఏటా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల జాబితాను పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా రూపొందించింది. మొత్తం ఖాళీల్లో 70% పదోన్నతుల ద్వారా భర్తీ, మిగతా 30% నేరుగా నియమించేలా ప్రణాళిక తయారు చేసింది. 2026తో పాటు 2027, 2028, 2029 సంవత్సరాల్లో ఖాళీల జాబితాను రూపొందించింది.

Also Read: సత్యసాయి బాబా సేవలో వైసీపీ యువనేత డాక్టర్ బొత్స సందీప్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *