ఉపాధి పనుల్లో రోజు వారీ లక్ష్యాలను పూర్తి చేయాలి-కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
Mahatma Gandhi NREGA
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనుల్లో రోజు వారీ లక్ష్యాలను పూర్తి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. అలాగే ప్రతి కుటుంబానికి 100 రోజుల పనులు కల్పన కూడా శత శాతం జరగాలన్నారు. ఉపాధి పనులు పై టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పథక సంచాలకులు డ్వామా, ఏ.పి.డి లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఏ.పి.ఓ లతో మండల వారీగా సమీక్షించారు.పని దినాల కల్పనలో వెనుకబడిన మెంటాడ, రామభద్రపురం, సంతకవిటి, రాజాం, కొత్తవలస, భోగాపురం, గుర్ల మండలాలను కలెక్టర్ సమీక్షించారు. ప్రతి మండలంలో కనీసం 1000 మంది ఉపాధి శ్రామికులకు పని కల్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విజయనగరం జిల్లాలో సరాసరి వేతనం రూ. 300/- గా నిర్దేశించినప్పటికీ, ఈ నెలలో కేవలం రూ. 284/- మాత్రమే సాధించడంపై కలెక్టర్ కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సంతకవిటి, రాజాం, వంగర, దత్తిరాజేరు, రామభద్రపురం, బాడంగి వంటి మండలాల్లో జిల్లా సరాసరి వేతనం కంటే తక్కువగా ఉండటంపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాతావరణం అనుకూలంగా ఉన్నందున, ఎక్కువ మంది శ్రామికులను పనులకు హాజరయ్యేలా చేసి సరాసరి వేతనం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.విజయనగరం జిల్లా 100 రోజులు పని పూర్తి చేయుటలో వెనుకబడి ఉందని, ముఖ్యంగా రాజాం క్లస్టర్ లోని మండలాల్లో పని కల్పన ఇంకా పూర్తిగా వెనుకబడి ఉందని , ప్రతి ఒక్కరికీ వంద రోజుల పని కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో మంజూరైన ఫారం పాండ్స్, కంపోస్ట్ పిట్స్ , రింగ్ ట్రెంచెస్, ఫిష్ పాండ్స్ వంటి 4 రకాల పనులకు శ్రామికులను అవగాహన పరిచి, ఎక్కువ మందిని హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఫారం పాండ్స్ ప్లస్ అనే కొత్త సౌలభ్యాన్ని బండ్లపై పండ్ల మొక్కల పెంపకం ద్వారా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చవచ్చని డ్వామా పీడీ సూచించారు. మంజూరైన పశువుల శాలలు అన్నింటిని గ్రౌండ్ చేయవలసినదిగా తెలియజేస్తూ, ఈ వారం లో పూర్తిగా ప్రారంభించని మెంటాడ, రామభద్రపురం, వంగర, మెరకముడిదాం మండలాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
