జిల్లాలో ఐదు ఫుడ్ పార్కులు-కలెక్టర్ ఎస్.రాంసుదర్ రెడ్డి
Collector Ram Sundar Reddy reviewed five food parks in the district
జిల్లాలో ఐదు ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుదర్ రెడ్డి ఆదేశించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్దిలో భాగంగా వివిధ ప్రాజెక్టులకు భూసేకరణపై జిల్లా కలెక్టర్ తమ ఛాంబర్లో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విశాఖ ఆర్థిక రీజియన్లో భాగంగా జిల్లాలో ఐదు ఫుడ్ పార్కులు, రెండు ప్రయివేటు ఇండస్ట్రియల్ పార్కులు, ఐటి హబ్స్, ఏరో సిటి తదితర వాటిపై సమీక్షించారు. జిల్లాలో ఫుడ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. ఒక్కో రెవెన్యూ డివిజన్లో ఒక ఫుడ్ పార్కు ఏర్పాటుకు సుమారు 200 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని, వీటితోపాటు పతంజలి, జెఎస్డబ్ల్యూ ఫుడ్పార్కులు కూడా ఏర్పాటు అవుతాయని తెలిపారు. వీటి భూసేకరణ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.జిందాల్, కొత్తవలస ఇన్ఫ్రా పేరుతో రెండు ప్రయివేటు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. భోగాపురంలో 500 ఎకరాలను ఏరోసిటీకి కేటాయించడం జరిగిందన్నారు. భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లో ఏర్పాటు కానున్న ఐటి హబ్స్ కు భూములు గుర్తించాలని సూచించారు. రెల్లిలో గ్రేహౌండ్స్ కు ఇప్పటికే భూముల కేటాయింపు పూర్తయ్యిందన్నారు. ఎంఎస్ఎంఈ పార్కులు, వివిధ రైల్వే లైన్లు, జాతీయ రహదారుల భూసేరణ, పరిశ్రమల విస్తరణ, కొత్త పరిశ్రమల ఏర్పాటుపై సమీక్షించి, భూసేకరణ వేగంగా పూర్తిచేసి అప్పగించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో సిపిఓ పి.బాలాజీ, ఆర్డిఓ డి.కీర్తి, జిఎంజిఓ సిహెచ్ సూర్యచంద్రరావు, ఏపిఐఐసి జెడ్ఎం మురళీమోహన్, పరిశ్రమల శాఖ జిఎం కరుణాకర్, ఇ సెక్షన్ సూపరింటిండెంట్ టి.గోవింద తదితరులు పాల్గొన్నారు.
