టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ పై చిన్న శ్రీను ఆగ్రహం
Majji Srinivasarao
Majji Srinivasarao slams TDP: రాష్ట్రాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం… ప్రజా సమస్యలపై చర్చ జరగనీయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మెన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆరోపించారు. ముఖ్యంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ప్రతిపాదించిన “మావిగాన్” వంటి కీలక అంశాన్ని పక్కదారి పట్టించేందుకు… మంత్రి అచ్చెన్నాయుడు అనవసరంగా దశాబ్దాల క్రితం జరిగిన విషయాలను లేవనెత్తుతున్నారని ఆయన విమర్శించారు.

Majji Srinivasarao slams TDP: బుధవారం ధర్మపురిలోని సిరిసహాశ్ర రైజింగ్ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివిధ సామాజిక, రాజకీయ అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కెవి సూర్యనారాయణ రాజు, నెక్కల నాయుడు బాబు, జిల్లా జనరల్ సెక్రటరీలు ఇప్పిలి అనంత్, రవి కుమార్, నరసింహ మూర్తి, జిల్లా ఆర్.టి.ఐ విభాగ అధ్యక్షులు అప్పాన సుబ్రహ్మణ్యం, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు జై హింద్ కుమార్, భోగాపురం, గరివిడి మండల పార్టీ అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ, విశ్వేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి కనకల రఘు, జిల్లా పార్టీ ఆక్టివిటీ కార్యదర్శి పోలీసు కృష్ణ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Majji Srinivasarao slams TDP: ఈ సందర్భంగా జెడ్పీ చైర్మెన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ… రాష్ట్ర రాజకీయాల్లో అసలు సమస్యలపై చర్చ జరగకుండా దారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లీ ప్రస్తావించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చించకుండా, భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని అన్నారు. గతంలో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ టీడీపీ నాయకులు తమ పార్టీ కార్యాలయంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని విమర్శించారు. 15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలను ఇప్పుడు లేవనెత్తడం ప్రజలను మభ్యపెట్టే యత్నమేనని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీపై గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన చిన్న శ్రీను
గతంలో సాక్షాత్తూ ప్రధాని మోదీ మరియు ఇతర నేతలపై సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు ప్రజలకు తెలియవా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు నాటి ఎన్టీఆర్ నుండి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వరకు టీడీపీ నాయకులు ఉపయోగించిన భాషను ప్రజలు మరచిపోలేదని తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో అచ్చెన్నాయుడు చేసిన “పార్టీ లేదూ, బొక్కా లేదూ” వంటి వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రజల మదిలో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. అదేవిధంగా పార్థసారధి, కన్నా లక్ష్మీనారాయణ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి నాయకులు గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన విమర్శలను కూడా ప్రజలు మరిచిపోలేరని అన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కపక్ష విమర్శలు చేయడం సరికాదని సూచించారు. అంతేకాదు గతంలో వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన మీడియా కథనాలను ఆయన ప్రదర్శించారు.

ఎయిర్ పోర్ట్ పేరుతో భూ దోపిడీకు పాల్పడుతున్న టీడీపీ నేతలు
Majji Srinivasarao slams TDP: భోగాపురం ఎయిర్పోర్ట్ (Alluri Sitarama Raju International Airport) పేరుతో పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో పెద్ద ఎత్తు భూ కుంభకోణం జరుగుతోందని చిన్న శ్రీను ఆరోపించారు. వివిధ ప్రాజెక్టుల పేరుతో రైతులను బెదిరించి, ఒత్తిడి తెచ్చి వారి భూములను లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి ప్రాజెక్టులు అమలు అయ్యే పరిస్థితి కనిపించడం లేదని… ప్రచార కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను పక్కనబెట్టి రాజకీయ లాభాల కోసం ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని హెచ్చరించారు. అంతేకాదు ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని, తప్పుడు ప్రచారాలకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Also Read: రైతులను దగా చేస్తోన్న కూటమి ప్రభుత్వం – మజ్జి శ్రీనివాసరావు
