ప్రజా సేవకు మళ్ళీ అంకితమవ్వండి -జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
ZP Chairman Majji Srinivasa Rao
ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ ప్రజా సేవకు మళ్ళీ అంకితమవ్వాలని పదవీకాలం పూర్తి చేసుకున్న మాజీ సర్పంచ్ లకు జెడ్పీ ఛైర్పర్సన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి వైసీపీ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) పిలుపునిచ్చారు. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సమన్వయకర్త శంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు నేతృత్వంలో బొబ్బిలి నియోజకవర్గంలో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న మాజీ సర్పంచ్‌లకు ఆత్మీయ సత్కారం శుక్రవారం సూర్య రెసిడెన్సిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్, పార్టీ పరిశీలకుడు రొంగలి జగన్నాథ్ రావుతో కలిసి చిన్న శ్రీను పాల్గొన్నారు. పదవీ విరమణ చేసిన సర్పంచుల సేవలను కొనియాడుతూ, వారిని దుశ్శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా చిన్నశ్రీను మాట్లాడుతూ, గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌ల పనితనమే కీలకమని అన్నారు.

కోవిడ్ వల్ల రెండేళ్లు, కూటమి ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్ల రెండేళ్లు దాదాపు నాలుగేళ్ల విపత్కర పరిస్థితుల్లో కూడా సర్పంచ్ లుగా ప్రజలకు సేవ చేసిన తీరు ప్రశంసనీయమన్నారు. ప్రస్తుత పాలకుల వైఖరి వల్ల స్థానిక సంస్థలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మండిపడ్డారు. ప్రజల నమ్మకాన్ని మరింతగా నిలబెట్టుకునేలా ముందుకు సాగాలని చిన్నశ్రీను పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా లేకపోయినా గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు ప్రజా సేవలో ఎక్కడా నిరుత్సాహ పడకుండా, మరింత చురుకుగా ఉండాలని కోరారు. గతంలో జగనన్న ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇచ్చిన ప్రాధాన్యతను ప్రజలకు గుర్తు చేస్తూ, అటువంటి ప్రజమోదయోగ్యమైన విధానాలను మళ్ళీ తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు శంబంగి వేణు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
