రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి-జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
Focus on solving revenue problems
జిల్లాలో దీర్ఘకాలంగా ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేకంగా రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. దీనికోసం అవసరమైన ప్రతిపాదనలను, పరిష్కారాలను రూపొందించాలని సూచించారు. ముందుగా జిల్లాలో రెవెన్యూ పరమైన ప్రధాన సమస్యలను తెలుసుకున్నారు.రీసర్వే ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక మరియు క్షేత్రస్థాయి సమస్యలు, జాయింట్ ఎల్పీఎం, 22 ఏ, దేవాదాయ శాఖ భూములు,అన్-సర్వేయిడ్ & అన్-సెటిల్డ్ గ్రామాలు, ఎస్టేట్,ఈనాం గ్రామాల సమస్యలు, ఈనాం భూములకు సంబంధించి ఉన్న న్యాయపరమైన, రెవెన్యూ చిక్కులు,ఎండీఆర్, వెబ్ ల్యాండ్, అడంగల్ రికార్డులు, వ్యవసాయ సాగు పట్టాలు, ఇళ్ల పట్టాలు, టైటిల్ డీడ్లు తదితర అంశాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రతి సమస్యను నిశితంగా పరిశీలించి, పరిష్కారానికి సమగ్ర నివేదికలను రూపొందించాల్సి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో వీటికి పరిష్కారాలను కనుగొనాలని, అవ్వని వాటిని రాష్ట్ర స్థాయికి పంపింస్తామని చెప్పారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేధు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.
