రోడ్లపై డెబ్రిస్ వేస్తే భారీ జరిమానా-కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
Vizianagaram Collector on Debris: ఇష్టానుసారం రోడ్లప్రక్కన డెబ్రిస్ వేసే వారిపట్ల కఠన చర్యలు తీసుకోవాలని విజయనగరం (Vizianagaram) జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఇలా డెబ్రిస్ వేసే వారిని సమీపంలోని సీసీ కెమెరాల ద్వారా గుర్తించాలని సూచించారు. డెబ్రిస్ వేసినట్లు నిర్ధారణ అయినవారికి రూ.లక్షకు తక్కువ కాకుండా జరిమానా విధించాలని స్పష్టం చేశారు.విజయనగరం జిల్లాలోని నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయితీల అధికారులతో కలెక్టరేట్ లో మంగళవారం సమావేశం జరిగింది. ఆయా సంస్థల్లో పారిశుధ్యం, సిబ్బంది, వాహనాలు, చెత్త నిర్వహణ, త్రాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, గృహ నిర్మాణం, అన్న క్యాంటీన్లు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. డెబ్రిస్ ను రోడ్ల ప్రక్కన పడేయడం వల్ల పర్యావరణానికి నష్టం కలగడమే కాకుండా, వాహనదారులకు సైతం ఇబ్బంది కలుగుతోందని చెప్పారు. పారిశుధ్య సిబ్బంది కూడా దీనిపై నిఘా ఉంచాలని సూచించారు.
Vizianagaram Collector on Debris: ప్రజలకు సురక్షిత త్రాగునీటిని అందించాలని ఆదేశించారు. కాలువల్లో త్రాగునీటి పైపు లైన్లు ఉండకుండా చూడాలన్నారు. ప్రతీ మున్సిపాలిటీలో సమగ్ర చెత్త నిర్వహణ అత్యవసరమని స్పష్టం చేశారు. చెత్తను రీ సైక్లింగ్ చేసి, దాని నిర్వహణకు అవసరమైన ఆదాయాన్ని సంపాదించాలని సూచించారు. మురుగునీటి నిర్వహణ కోసం ఎస్టీపీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. అన్న క్యాంటీన్లు నిర్వహణ మరింత మెరుగ్గా ఉండాలని చెప్పారు. వర్షపు నీటి సంరక్షణ కట్టడాలను ఎక్కువగా నిర్మించాలని కలెక్టర్ సూచించారు.సమావేశంలో సిపివో పి.బాలాజీ, పబ్లిక్ హెల్త్ ఈఈ టి.జ్యోతి, మున్సిపల్ కమిషనర్లు పి.నల్లనయ్య, అప్పలరాజు, రామలక్ష్మి, శ్రీనివాసరావు, జయరాం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read: ఘనంగా మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి-ఎస్పీ ఎ.ఆర్.దామోదర్
