‘త్యాగధనుడు, నిత్యస్మరణీయుడు పొట్టి శ్రీరాములు’
త్యాగధనుడు, నిత్యస్మరణీయుడు పొట్టి శ్రీరాములు'
తెలుగు వారి ఔన్యత్యానికి ప్రతీక, త్యాగధనుడు, పొట్టి శ్రీరాములు నిత్య స్మరణీయుడని మాన్సాస్ కరస్పాండెంట్ డాక్టర్ కె వెంకటలక్ష్మీపతిరాజు పేర్కొన్నారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో కోటలో గల మోతీమహల్లో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు వంటి నిస్వార్థపరులైన దేశభక్తులు పది, పన్నెండుమంది తన అనుచ రులుగా ఉంటే స్వరాజ్యాన్ని ఏనాడో సాధించి ఉండేవాణ్ణి అని మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ప్రస్తావించారు. తన ప్రాణాన్ని తృణప్రాయం గా త్యజించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు పట్టుదలను, కార్యదీక్షను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
మహారాజా అటానమస్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం సాంబశివరావు స్వార్థ రాహిత్యం, పట్టుదల, నిరాడంబరత, మొక్కవోని నమ్మకం, ఆగని పరిశ్రమ, సూక్ష్మమైన బుద్ధి వంటి అంశాలు పొట్టి శ్రీరాములు నుండి నేటి యువత అలవరుచుకోవాలని అన్నారు. సమితి అధ్యక్షులు గురుప్రసాద్ మాట్లాడుతూ పురాణాలలో మనం విన్న దధీచి,శిబి చక్రవర్తి కంటే పొట్టి శ్రీరాములు గొప్పవాడని, త్యాగనిరతికి ప్రతీకగా నిలిచారని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్ధులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలకు, పొట్టి శ్రీరాములు జీవితవిశేషాలపై ప్రత్యేకంగా పేపర్ ప్రెజెంటేషన్ విద్యార్ధులకు పతకాలను, బహమతులను, ప్రశంసాపత్రాలను ప్రదానం చేసారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. సుమారు 110 మంది విద్యార్ధులు చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో కుసుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుసుమంచి సుబ్బారావు, వనితావాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు సుభద్రాదేవి, లక్ష్మీ రామదాసు, దాసరి పద్మ, సమైక్య భారతి సమన్వయర్త కన్నయ్య, అధ్యక్షులు సత్యనారాయణ,ధవళ సర్వేశ్వరరావు, కాగుపాటి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల తెలుగు విభాగం అధిపతి డాక్టర్ ఎన్ సూర్యకాంతి సమన్వయకర్తగా వ్యవహరించారు.
