ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త..ప్ర‌తీఒక్క‌రి నైతిక బాధ్య‌త‌- మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్

Environmental cleanliness is a moral responsibility

Environmental cleanliness is a moral responsibility

ప‌రిస‌రాలను ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డం ప్ర‌తీఒక్క‌రి నైతిక బాధ్య‌త అని, రాష్ట్ర చిన్న సూక్ష్మ మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, పేద‌రిక నిర్మూల‌న‌, ఎన్నారై సాధికార‌తా సంబంధాల శాఖామంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు. ప్ర‌తీఒక్క‌రూ త‌మ ఇంటితోపాటు చుట్టుప్ర‌క్క‌ల ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని కోరారు. స్థానిక ప్ర‌భుత్వ పారిశ్రామిక శిక్ష‌ణా సంస్థ‌లో  నిర్వ‌హించిన స్వ‌ర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మంలో మంత్రి శ్రీ‌నివాస్‌, జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్ధుల‌తో క‌లిసి స్వ‌చ్ఛాంధ్ర ప్ర‌తిజ్ఞ చేశారు. ఆవ‌ర‌ణ‌లో మొక్క‌ల‌ను నాటారు. ఐటిఐలోని ల్యాబ్‌లు, త‌ర‌గ‌తి గ‌దుల‌ను ప‌రిశీలించారు. విద్యార్ధులు నిరుప‌యోగ వ‌స్తువుల‌తో రూపొందించిన క‌ళాకృతుల‌ను తిల‌కించి అభినందించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీ‌నివాస్ విద్యార్ధుల‌నుద్దేశించి మాట్లాడుతూ, మంచి గాలి, చ‌క్క‌ని ఆహారం మ‌నకు అందాలంటే ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌తోపాటు, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త కూడా ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ప్లాస్టిక్‌, ఇత‌ర ర‌సాయ‌న ప‌దార్ధాల కార‌ణంగా ప‌రిస‌రాలు విష‌పూరితంగా మారుతున్నాయ‌ని చెప్పారు. ప్ర‌స్తుత‌, భ‌విష్య‌త్తు త‌రాల కోసం వీటిని నివారించేందుకు ప్ర‌తీఒక్క‌రూ కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప‌రిశుభ్ర‌త‌, ఆరోగ్యం ద్వారానే స్వ‌ర్ణాంధ్ర క‌ల సాకార‌మ‌వుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలో యువ‌త జ‌నాభా ఎక్కువ‌గా ఉంద‌ని, మ‌న దేశానికి యువ‌తే ప్ర‌ధాన సంప‌ద అని పేర్కొన్నారు. త‌మ‌లోని నైపుణ్యాన్ని మెరుగుప‌ర్చుకోవాల‌ని సూచించారు. కొన్ని దేశాల్లో ఐటి విద్యార్ధుల‌కంటే ఐటిఐ విద్యార్ధుల‌కు జీతాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెప్పారు. మ‌న ముందున్న అవ‌కాశాల‌ను పూర్తిగా స‌ద్వినియోం చేసుకోవ‌డం ద్వారా ఉన్న‌త స్థాయికి చేర‌వ‌చ్చున‌ని అన్నారు.

జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ, స్వ‌చ్ఛ‌త ప్ర‌తీఒక్క‌రి జీవితంలో భాగం కావాల‌ని పిలుపునిచ్చారు. ప‌రిశ‌రాల ప‌రిశుభ్ర‌త‌, స్వ‌చ్ఛ‌త గురించి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించేందుకే ప్ర‌తీనెలా 3వ శ‌నివారం స్వ‌ర్ణాంధ్ర‌- స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని అన్నారు. ప్ర‌తీనెలా ఒక ముఖ్య‌మైన అంశంతో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. వాతావ‌రణం క‌ల్పించే అవ‌కాశాలు అన్న అంశంతో ఈ నెల కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. ఐటిఐ విద్యార్ధుల‌కు ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయ‌ని అన్నారు. త్వ‌ర‌లో ఐటిఐ, పాలిటెక్నిక‌ల్ విద్యార్ధులకు బాగా డిమాండ్ పెరుగుతుంద‌ని, దీనిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ప్లాస్టిక్ వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి హాని ఏర్పుడుతోంద‌ని చెప్పారు. అలాగే మితిమీరిన ఎరువుల వినియోగం వ‌ల్ల ఆహార ప‌దార్ధాలు క‌లుషితం అయిపోయి, వివిధ రకాల వ్యాధులు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. అందువ‌ల్ల ఎరువుల వినియోగాన్ని త‌గ్గించి, సేంద్రీయ వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ దిశ‌గా ఎన్నో అవ‌కాశాలు రానున్నాయ‌ని చెప్పారు. అదేవిధంగా ప్ర‌త్యామ్నాయ ఇంధ‌న వ‌న‌రులైన సూర్య‌ర‌శ్మి లాంటి వాటిని వినియోగించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.ఈ కార్య‌క్ర‌మంలో ఐటిఐ ప్రిన్సిప‌ల్ టివి గిరి, జిల్లా నైపుణ్యాధికారి ప్ర‌శాంత్‌, జిల్లా గిరిజ‌న సంక్షేమాధికారి శ్రీ‌నివాస‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *