దొంగతనాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి -ఎస్పీ
Vizianagaram District SP A.R. Damodar
వేసవి కాలంలో జిల్లాలో దొంగతనాలు జరిగేందుకు అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎ .ఆర్.దామోదర్ పిలుపునిచ్చారు.వేసవి కాలంలో చాలా మంది కుటుంబ సమేతంగా ప్రజలు స్వగ్రామాలకు, పర్యటనలకు వెళ్ళడం, ఇళ్ళను ఖాళీగా వదిలి ఇతర ప్రాంతాలకు వెల్లడం, ఆరుబయట నిద్రించడం వలన దొంగతనాలు, చోరీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కావున, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, విజయనగరం 1వ, 2వ పట్టణ, రూరల్, నెల్లిమర్ల, రాజాం, బొబ్బిలి ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టం (ఎల్.హెచ్.ఎం.ఎస్) సేవలను వినియోగించు కోవాలన్నారు. పోలీసులకు ముందస్తుగా సమాచారం ఇవ్వడం వలన గస్తీ, పెట్రోలింగు సమయాల్లో ఆయా ఇళ్ళపై ప్రత్యేకంగా నిఘా పెట్టే అవకాశం ఉంటుందన్నారు. ఎల్.హెచ్.ఎం.ఎస్. యాప్ ను మొబైల్ ఫోన్లలో డౌన్లోడు చేసుకొని, పోలీసుశాఖకు రిక్వెస్ట్ పంపినట్లయితే స్థానిక పోలీసులు ఆయా ఇండ్ల పరిసరాల్లో ప్రత్యేకంగా కెమెరాలను ఏర్పాటు చేసి, ఆయా ఇండ్లను నిరంతరం గమనిస్తూ, పర్యవేక్షిస్తుంటారని తెలిపారు.
అదే విధంగా పరీక్షలు పూర్తయి వేసవి సెలవులు కారణంగా ఇంటి వద్దనే ఉంటున్న తమ పిల్లలను ఒక కంట కనిపెడుతుండాలన్నారు. ఈతల కోసం చెరువులు, నదులు, నూతుల్లో దిగకుండా చూడాలని, నిపుణుల పర్యవేక్షణలోనే ఈత నేర్చుకొనే శిక్షణ పొందాలన్నారు. పిల్లల్లో నైతిక విలువలు పెంచేందుకు, వారిలో క్రీడా ప్రతిభను, డ్రాయింగ్, సింగింగు, డాన్స్ వంటి సృజనతాత్మకమైన కళలను, నైపుణ్యాలను వెలికితీసే విధంగా చర్యలు చేపట్టాల న్నారు. పిల్లలు చెడు స్నేహాలకు, వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా వారి ప్రవర్తనను గమనిస్తుండాలని, వారిపై ప్రేమ కనబరుస్తూనే వారు ఎక్కడకు వెళ్ళింది, ఎవరితో స్నేహం చేస్తున్నది, వారు ఏమి చేస్తున్నది గమనించాలని తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ సూచించారు.వేసవి కాలంలో దొంగతనాలను నియంత్రించేందుకు జిల్లా పోలీసుశాఖ నైట్ పెట్రోలింగును, గస్తీని ముమ్మరం చేస్తున్నప్పటికి, ప్రజలు కూడా దొంగతనాల నియంత్రణకు తమవంతు బాధ్యతగా కొన్ని జాగ్రత్తలను పాటించాలని కోరారు.
