రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేపట్టాలి – మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Kondapalli Srinivas
Kondapalli Srinivas on Paddy: మిల్లర్లు, ఎఫ్‌సిఐ, పౌర సరఫరాలు, వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేకరణ సాఫీగా చేపట్టాలని ఎంఎస్‌ఎంఇ, సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) సూచించారు. గత ఏడాది 3.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల వద్ద నుండి సేకరించిందని… ఈ నేపథ్యంలో ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా నిర్ణయించామన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం సేకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ సేధు మాధవన్… ధాన్యం సేకరణ కేంద్రాల ఏర్పాట్లు, తూనికలు, గోనె సంచుల లభ్యత, పని విధానంపై మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్ బి. శాంతి, జిల్లా పౌర సరఫరాల అధికారి మురళీధర్, మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బి. వెంకట్రావు, ఎఫ్‌సిఐ జిల్లా మేనేజర్ సునీల్ కుమార్, మార్కెటింగ్ ఎడి రవీంద్ర, మార్క్‌ఫెడ్ డీఎం వెంకటేశ్వర రావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
Kondapalli Srinivas on Paddy: ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… గత ఏడాది రైతులకు చెల్లింపులు 48 గంటల్లోగా జరిగాయి. కొన్ని సందర్భాల్లో ఒక గంటలోపే నగదు చెల్లింపులు జరిగాయి. ఈ ఏడాది నవంబర్ నెలలోనే సేకరణ ప్రారంభించడంతో ఇప్పటికే సుమారు 30 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు వివరించారు. వరి పంటలో లాభాలు తక్కువగా ఉన్నప్పటికీ, రైతులు వరి సాగు కొనసాగిస్తున్నందున వారికి మరింత ప్రోత్సాహం కల్పించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని చిన్న సమస్యలు ఎదురైనా వాటిని వెంటనే పరిష్కరించుకుంటూ సేకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం నిల్వలకు తగిన వసతులు లేకపోవడంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. చీపురుపల్లి, బొబ్బిలి డివిజన్లలో ఇప్పటికే ధాన్యం సేకరణ ప్రారంభమైందని, విజయనగరం డివిజన్లో త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు.
ధాన్యంలో తేమశాతం లేదా వేస్టేజ్ పేరుతో నాలుగు, ఐదు కిలోలు తక్కువ చేయడం సరికాదని హెచ్చరించారు. మధ్య దళారుల ప్రభావాన్ని పూర్తిగా తగ్గించాలని, అవసరమైనచోట కఠిన చర్యలు తీసుకోవాలని తాసిల్దార్లను ఆదేశించారు. వర్షాలు పడినప్పటికీ ధాన్యం పాడవకుండా 2000 టార్పాలిన్లు సిద్ధంగా ఉంచామని, మరో 1600 టార్పాలిన్లు రానున్నాయని కలెక్టర్ చెప్పారు.
Also Read: అభ్యుదయ వాది-తెలుగు సాహిత్య సారధి-గురజాడ అప్పారావు
