గరివిడి జెడ్పీటీసీగా బొత్స పూజిత ఘన విజయం
Botcha Poojitha
Botcha Poojitha Won Garividi: మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కోడలు బొత్స పూజిత… గరివిడి జెడ్పీటీసీ స్థానంలో ఘన విజయం సాధించారు. శనివారం విడుదలైన స్థానిక సంస్ధల ఎన్నికల ఫలితాల్లో తన సమీప ప్రత్యర్ధి, చీపురుపల్లి ఎమ్మెల్యే మరియు టీడీపీ సీనియర్ నేత కిమిడి వెంకట్రావు కోడలు కిమిడి సంధ్యను 1599 ఓట్లు తేడాతో ఓడించారు. ఎంపీటీసీ అభ్యర్ధుల ఓట్ల లెక్కింపు నుండి గరివిడి మండలంలో వైసీపీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో గరివిడి మండలంలోని 20 ఎంపీటీసీ స్థానాలకు గాను 11 స్థానాలకు గెలుచుకుని… ఎంపీపీ పదవిని తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత ప్రారంభమైన జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లోనూ పోస్టల్ బ్యాలెట్ ను మొదలు కొని మొదటి రౌండ్ నుండి కూడా బొత్స పూజిత ముందంజలో ఉంది. చివరకు కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి 1599 ఓట్లు తేడాతో టీడీపీ అభ్యర్ధిని ఓడించి… చీపురుపల్లి గడ్డ… బొత్స కుటుంబం అడ్డా అని నిరూపించింది. దీనితో గరివిడి వైసీపీ కార్యాలయంతో పాటు… మండలంలోని పలు గ్రామాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గరివిడి వైసీపీ కార్యాలయంకు చేరుకుని బాణ సంచా కాల్పి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. దీనితో బొత్స పూజిత గెలుపుతో గరివిడి మండలానికి ఒకరోజు ముందుగానే దీపావళి వచ్చినట్లయింది.

Botcha Poojitha Won Garividi: రాష్ట్రమంతా అధికార కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాలు వస్తున్నప్పటికీ… ఈ గెలుపు ద్వారా చీపురుపల్లి నియోజకవర్గంలో మాత్రం బొత్స కుటుంబానికి తిరుగులేదు అనే సందేశాన్ని పంపించారు. అంతేకాదు 2024 సార్వత్రిక ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసిన తన మామ బొత్స సత్తిబాబును ఓడించిన కిమిడి కళా వెంకట్రావుకు ఈ గెలుపు ద్వారా బొత్స కుటుంబం ధీటైన సమాధానం ఇచ్చింది. గరివిడితో పాటు గుర్ల మండలంలో కూడా బొత్స సత్యనారాయణ సోదరి ఎస్వీ లక్ష్మి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్ధి చనమల్లు రాధపై 316 ఓట్లతో విజయం సాధించారు. అయితే బొండపల్లి జెడ్పీటీసీగా పోటీ చేసిన బొత్స కుమార్తె అనూష మాత్రం భారీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.


Also Read: గరివిడి-2 ఎంపీటీసీగా గెలుపొందిన మజ్జి లావణ్య
