జిల్లాలో గ్యాస్ కొరత లేదు..తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు-జాయింట్ కలెక్టర్
Joint Collector S. Sethu Madhavan
జిల్లాలో గ్యాస్ కొరత ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ స్పష్టం చేశారు. జిల్లాలో గ్యాస్ సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని, వినియోగదారులు అపోహలను నమ్మవద్దని ఆయన కోరారు. గ్యాస్ బుకింగ్ కోసం వెబ్ పోర్టల్ అందుబాటులో ఉన్నప్పటికీ, వినియోగదారులు నిబంధనల ప్రకారం గడువు ముగిసిన తర్వాతే బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. దీని ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకసారి, పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు ఒకసారి మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు.
అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతూ, పౌరసరఫరాల శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో భాగంగా విజయనగరం మండలంలోని వూడా కాలనీ, కస్పా వీధిలో 13 సిలిండర్లు మరియు కొత్తవలస మండలంలో 3 డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నామని, సంబంధిత వ్యక్తులపై 6ఏ కేసులు నమోదు చేశామని జాయింట్ కలెక్టర్ వివరించారు. ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, ప్రజలు కేవలం అధికారిక సమాచారాన్నే నమ్మాలని ఆయన కోరారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని ఎస్. సేధు మాధవన్ తెలిపారు.
