కూటమి పాలనలో ప్రాణాంతకంగా పాలు, నీరు – చిన్న శ్రీను
Chinna Srinu
Chinna Srinu comments on government: కూటమి ప్రభుత్వంలో పాలు, నీళ్ళు ప్రాణాంతకంగా మారాయని ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మెన్, జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆరోపించారు. దీనికి ఇటీవల కురుపాం, గుర్ల, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, తురకపాలెం, విజయవాడ ప్రాంతాల్లో వెలుగుచూసిన డయోరియా మరణాలు నిలువెత్తు నిదర్శనమన్నారు. శనివారం ధర్మపురిలోని తన క్యాంప్ కార్యాలయం సిరి సహస్ర రేసింగ్ ప్యాలెస్ లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శులు కెవి సూర్యనారాయణ రాజు, నెక్కల నాయుడు బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి, ఎస్సీ సెల్ అధ్యక్షులు జైహింద్ కుమార్ పాల్గొన్నారు.

“ఎవరైనా బ్రతకడానికి పాలు, నీళ్లు తాగుతారు. కానీ ఏపీలో ఆ రెండూ ప్రాణాంతకంగా మారుతున్నాయి. కల్తీ పాలు, కలుషిత నీటి కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, సీఎం నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) పాలనలో డయేరియా, ఫుడ్ పాయిజన్ ఘటనలు అధికమయ్యాయి. పరిపాలనపై ప్రభుత్వం తన పట్టు కోల్పోవడంతో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని ఆయన ఆరోపించారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 20 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లు, విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్, కలుషిత నీరు, అపరిశుభ్రత కారణంగా దాదాపు 25 ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. 15 జిల్లాల్లో 900 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. చేబ్రోలు, విజయవాడ, గుంటూరు, గుర్ల, శ్రీకాకుళం, తురకపాలెం ప్రాంతాల్లో డయేరియా ప్రబలిందని, వందలాది మంది అస్వస్థతకు గురై, డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయని తెలిపారు. ముఖ్యంగా కలుషిత నీరు, అపరిశుభ్రతే ప్రధాన కారణాలని పేర్కొన్నారు.
Chinna Srinu comments on government: కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో ఇటీవల 16 మంది విద్యార్థినులు డయేరియా (Diarrhea) తో అస్వస్థతకు గురవగా… వారిలో ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. గతంలో ఇదే పాఠశాలలో కలుషిత నీటి కారణంగా ఇద్దరు బాలికలు మృతి చెందగా, దాదాపు 200 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారని గుర్తుచేశారు. ఇంతటి దారుణ ఘటనల అనంతరం కూడా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇటీవల శ్రీకాకుళంలో కలుషిత నీటి కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయి, దాదాపు 200 మంది ఆస్పత్రుల పాలయ్యారని తెలిపారు. అలాగే రాజమహేంద్రవరం నగరంలో కల్తీ పాలు తాగి ఏడుగురు మరణించగా, మరికొందరు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. పోషణ ఇవ్వాల్సిన పాలు మరణానికి కారణమవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పరిస్థితిని సమీక్షించి, సురక్షిత నీటి సరఫరా, ఆహార భద్రత పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. పరిశుభ్రత ప్రమాణాలను కఠినంగా అమలు చేసి, మరిన్ని ప్రాణనష్టాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
యూరియా కొరత – డయోరియా మోతగా కూటమి ప్రభుత్వం పనితీరు
Chinna Srinu comments on government: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపి పాలనలో సంక్షేమం , అభివృద్ధి రెండు కళ్ళుగా పరిపాలన సాగిందని… కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత యూరియా కొరత , డయేరియా మోత గా మారిందని ఎద్దేవా చేసారు. గతంలో కురుపాం గిరిజన సంక్షేమ హాస్టల్ లో విద్యార్ధినులు పచ్చకామెర్ల బారిన పడితే… వైసీపీ అధినేత జగన్ స్వయంగా బాధితులను పరామర్శించి వారికి అండగా నిలిచారన్నారు. కాని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబుది పబ్లిసిటీ తప్ప… ప్రజలకు మీరు చేసింది ఏమైనా ఉందా ? అంటూ ప్రశ్నించారు. భూములు దోచుకోవడం మీద మాత్రమే పూర్తిగా శ్రద్ధ పెట్టారు తప్ప … సంక్షేమం , అభివృద్ధి పట్ల ఏమాత్రం ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఆరోపించారు.
Also Read: కల్తీ చేసి తిరిగి ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా – వైసీపీ పై మంత్రి కొండపల్లి ఆగ్రహం
