Bingo circus entertains the audience

Bingo circus entertains the audience

అబ్బుర పరిచే విన్యాసాలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ బింగో సర్కస్ ఆకట్టుకుంటోంది. ఇప్పటి తరం వారికి సర్కస్ లు పెద్దగా పరిచయం లేదనే చెప్పాలి. ఇప్పుడు ఆ లోటును ఈ సర్కస్ తీర్చుతోంది. మణిపూర్ సాహసికులు, కత్తులు నోట్లో పెట్టుకునే విన్యాసాలు, ఒక గ్లోబ్ లో మూడు ద్విచక్ర వాహనాలతో ఏకకాలంతో తిరిగే ప్రదర్శనలు, మరుగుజ్జుల హాస్యం పిల్లలను ఆనందంలో ముంచెత్తుతోంది. కళ్లు తిప్పుకొనీయకుండా 25 నుంచి 30 ప్రదర్శనలు.. దాదాపు రెండు గంటల పాటు నాన్ స్టాప్ వినోదాన్ని పంచిపెడుతున్నాయి.

ఆనందం వెనుక ఎంతోమంది కష్టం

సర్కస్ ప్రదర్శనలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచినప్పటికీ.. వాటి వెనుక ప్రదర్శనకారులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటారు. గతంలో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, డాగ్ షోలు ఉండేవి. రంగురంగుల చిలకలు, పక్షులతో విన్యాసాలు చేయించేవారు. 2015 తర్వాత వీటిపైన ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించింది. అప్పటి నుంచి ప్రేక్షకులు రావడం తగ్గించారు. తరతరాలుగా నమ్ముకుని ఉన్న కొంతమంది మాత్రమే.. ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. మంగోలియన్, ఆఫ్రికా, రష్యా, చైనా తదితర దేశాలు, మణిపూర్, మిజోరాం, మహారాష్ట్ర, అసోం, వెస్ట్ బెంగాల్, తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 100 మంది వరకూ కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం జిమ్నాస్టిక్ విన్యాసాలపైనే సర్కస్ ప్రదర్శనలను కొనసాగిస్తున్నారు.

ఎన్నో ఏళ్ల తర్వాత విజయనగరానికి..

సర్కస్ అంటే ఒక్కప్పుడు పెద్ద వినోదం. మారిన పరిస్థితులు.. జంతువులతో ప్రదర్శన నిషేధం తర్వాత 80 శాతం మంది ఈ తరహా ప్రదర్శనలను నిలిపివేశారు. కొవిడ్ తర్వాత మరో పది శాతం మూతపడ్డాయి. చివరి సారిగా విజయనగరానికి 2017లో ఆఫ్రికన్ సర్కస్ వచ్చింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు మార్గంలోని మాన్సాస్ గ్రౌండ్ లో బింగో సర్కస్ పేరిట ఏర్పాటు చేశారు. ఉన్న కొద్ది సంస్థలే.. ఏడాది పొడవునా అన్ని రాష్ట్రాలూ తిరుగుతుంటాయి. ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు అక్కడే పలు జిల్లాల్లో నిర్వహిస్తూ వెళ్తారు. ప్రస్తుతం ఆదరణ తగ్గడం వల్ల మళ్లీ ఎన్ని సంవత్సరాలు తర్వాత ఈ సర్కస్ ను చూస్తామో తెలియని పరిస్థితి.

సర్కస్ ను ఆదరించాలి

గతంతో పోల్చుకుంటే సర్కస్ లకు ఆదరణ తగ్గింది. జంతువులను ప్రభుత్వం నిషేధించింది. ప్రేక్షకులకు ఏ మాత్రం వినోదం తగ్గకుండా.. రకరకాల విన్యాసాలతో రెండు గంటల పాటు నాన్ స్టాప్ వినోదం అందిస్తున్నాం. ప్రేక్షకులు సంతృప్తిగా వెళ్తే అదే మాకు పది వేలు. మార్చి 9వ తేదీ వరకూ ఇక్కడే ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత శ్రీకాకుళం వెళ్లిపోతాం. జిల్లా ప్రజలు సర్కస్ ను వీక్షించి.. కళాకారులకు ప్రోత్సాహం అందిస్తారని కోరుకుంటున్నాం.

– ఎస్.జితేంద్ర, మేనేజర్, బింగో సర్కస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *