జర్నలిస్టుల సంక్షేమానికి కృషి-ఎ.పి. డబ్ల్యుజెఎఫ్
APWJF meeting
జర్నలిస్టుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కృషిచేస్తోందని, సమస్యల పరిష్కారానికి కూడా చొరవ చూపుతోందని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు అన్నారు. త్వరలో నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమంలో జర్నలిస్టులు ఆధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. పెడరేషన్ జిల్లా అధ్యక్షులు కె.రమేష్ నాయుడు అధ్యక్షతన స్థానిక ప్రైవేటు హోటల్లో గురువారం ముఖ్యకార్యవర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని ముండలాల్లో వివిధ పత్రికలు, చానళ్లకు చెందిన జర్నలిస్టులు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఎ.పి. డబ్ల్యుజెఎఫ్) కృషి చేస్తోందన్నారు. దేశంలోని దాదాపు 18 రాష్ట్రాల్లో జర్నలిస్టులకు ప్రభుత్వాలు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయని, మన రాష్ట్రంలో జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని కోరారు.వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ ఫండ్ రూ. 50కోట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు, జర్నలిస్టుల పిల్లలకు అన్ని పాఠశాలలు,కళాశాలలో ఉచిత విద్య కల్పించాలని కోరారు. జర్నలిస్టులపై జరిగే దాడులను అరికట్టేందుకు వీలుగా రాష్ట్రంలో హోంశాఖ మంత్రి నేతృత్వంలో హైపవర్ కమిటీ, జిల్లాలో ఉన్న పోలీసు అధికారులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీసుబాబు, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. మురళి శంకర్రావు, జిల్లా కార్యదర్శి ఆర్ వ్యాసంబాబు, నాయకులు బూరాడ శ్రీనివాసరావు, ఎన్. ముదుసూదనరావు, జిల్లాకు చెందిన ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.
