భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం-జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి

The goal is to resolve land issues:District Collector

The goal is to resolve land issues: District Collector

జిల్లాలో తప్పులు లేని రెవెన్యూ రికార్డులను రూపొందించడం ద్వారా, భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికలకు ముందు నిర్వహించిన భూముల రీ సర్వే ప్రక్రియలో జరిగిన పొరపాట్లను సరిదిద్దడం తోపాటు, తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం, పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించడం లక్ష్యాలుగా రెవెన్యూ డివిజన్ల వారీగా క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందితో సమావేశాలను, శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మంగళవారం కలెక్టరేట్ వేదికగా విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలు మరియు గ్రామ సర్వేయర్లతో ఆయన కీలక సమావేశాన్ని నిర్వహించారు.

​సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. భూ యజమానులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అత్యంత పారదర్శకంగా, తప్పులు లేని రెవెన్యూ రికార్డులను రూపొందించడమే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. రికార్డులను మనకు మనమే సరిదిద్దుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని, దీనిని సద్వినియోగం చేసుకొని ఖచ్చితమైన వివరాలతో రివార్డులను రూపొందించాలని సూచించారు. రీ సర్వే పూర్తయిన భూములకు సంబంధించి రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసి, అర్హులైన రైతులందరికీ, ఖచ్చితమైన వివరాలతో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే రీ సర్వే పూర్తి అయిన 423 గ్రామాల్లో సుమారు 2,03,000 పాస్ పుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉందన్నారు. వ్యక్తిగతంగా భూముల వివరాలను పరిశీలించి, సంబంధిత రైతులతో మాట్లాడి ఇకేవైసి చేయాలని, వివరాలు సరిపోయాయని తేలిన తరువాతే పట్టాదారు పాసుపుస్తకాలను ప్రింటింగ్ చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను దశలవారీగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతినెలా 2 వ తేదీ నుంచి 9 వతేది వరకు పంపిణీ జరుగుతుందని తెలిపారు.

ఈ నెలకు సంబంధించి 12 గ్రామాల్లో 7993 ఖాతాలను పరిశీలించాల్సి ఉందన్నారు. మార్చి, ఏప్రిల్ నెలలకు 14 గ్రామాలు చొప్పున ఎంపిక చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా రెవెన్యూ క్లినిక్ లకు పదేపదే అదే వినతులు వస్తున్నాయని, వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా, క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని, ప్రజల నుంచి వచ్చే వినతులను సత్వరమే చట్టప్రకారం పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో విఆర్వో, ఆర్ఎస్డిటి, గ్రామ సర్వేయర్, మండల సర్వేయర్ కలిసి సంయుక్తంగా సరైన వివరాలను నమోదు చేయాలని చెప్పారు. అదేవిధంగా వివిధ అంశాలపై ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రజలనుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోందని, దీనిని తొలగించడంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి ఇ. మురళి, ఆర్డీవో డి.కీర్తి, సర్వే శాఖ ఏడి విజయకుమార్, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, టిఓటీలు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *