ఘనంగా సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం
shahaya spoorthi foundation
Sahaya Spoorthi Foundation Anniversary: సమాజంలో నలుగురికీ ఉపయోగేపడే వివిధ కార్యక్రమాలు చేయాలని అందరికీ ఉంటుందని… ఆచరణలో అనేక అవాంతరాలు ఎదురవుతాయని.. అయితే కొంతమంది మాత్రమే దానిని చేసి చూపించగలరని శాసన మండలి సభ్యులు గాదె శ్రీనివాసులు నాయుడు (Gade Srinivasulu Naidu) అన్నారు. సేవా గుణం దేవుడిచ్చిన గొప్ప వరమని చెప్పారు. ఆదివారం విజయనగరంలోని మెసానిక్ టెంపుల్ లో సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ పదో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను కొనియాడారు.
సేవాగుణం గొప్ప వరం – ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు
Sahaya Spoorthi Foundation Anniversary: మనం ఒక మంచి పని తలపెట్టినప్పుడు అనేక రకాల అడ్డంకులు, ఆటంకాలు కలుగుతాయని తెలిపారు. అటువంటి సమయంలో లక్ష్యం కోసం దిశ మార్చుకుని వెళ్లాలే తప్ప, ఆగిపోకూడదని చెప్పారు. లక్ష్యం ప్రధానమని.. మనం చేసేది మంచి పనైతే..మనకు తెలియకుండానే భగవంతుడు, తల్లిదండ్రులు, స్నేహితుల సహకారం తప్పక కలుగుతుందన్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన యువత.. అక్కడితో ఆగిపోకుండా, సమాజాభివృద్ధికి.. బడుగు వర్గాల అభ్యున్నతికి తమ వంతు తోడ్పాటు అందించడం అభినందనీయం అన్నారు. విద్య, వైద్యం కోసం.. నిరుపేదలను ఆదుకునేందుకు వీరు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ల దృష్టికి కూడా తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.


యువత సమాజం కోసం పాటుపడాలి – బాబ్జీ
Sahaya Spoorthi Foundation Anniversary: కొంతమంది యువత వ్యసనాల బారిన పడి, పెడదోవ పడుతున్న ప్రస్తుత రోజుల్లో.. సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంస్థ సభ్యులు అభినందనీయులని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. సామాజిక, నైతిక విలువలు నేడు దూరం అవుతున్నాయని.. ఇలాంటి సంస్థల సభ్యులు ఇంకా మానవత్వం మిగిలే ఉందని నిరూపిస్తున్నారని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలను నడపడం.. ఆపద వస్తే సొంత కుటుంబ సభ్యుల్లా సహాయం అందించడం చిన్న విషయం కాదన్నారు. దీన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ఒక్కరితో మొదలై.. నేడు 1,200 మంది సభ్యులతో వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆపదలో ఉన్నవారికి తామున్నాం అంటూ ముందుకు వస్తున్నారని కొనియాడారు.సేవా కార్యక్రమాలు కూడా ఒక వ్యసనమే అని, యువత ఇటువంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అభ్యుదయ విద్యాసంస్థల అధినేత సీహెచ్ శారద, బొంతలకోటి శంకరరావు, శంకర్ ఫౌండేషన్ ఫౌండర్ రాధాకృష్ణ, బంగారు రాజు, సెట్విజ్ అధికారి భరత్, రెడ్ క్రాస్ చైర్మన్ కేఆర్డీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా యువత చేపడుతున్న పేద విద్యార్థులకు విద్యా సహాయం, వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాల నిర్వహణ, నిత్యావసరాల అందజేత, స్వయం ఉపాధి యూనిట్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను ప్రశంసించారు.
విస్తృతంగా సేవా కార్యక్రమాలు
సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ పదో వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు పేదలకు నిత్యావసర సరుకులు, విదార్థులకు పుస్తకాలు, పెన్నులు, దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేశారు. వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న పలువురు వైద్యులను.. సమాజ హితం కోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను దుశ్శాలువ, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. సహాయ స్ఫూర్తి ఫౌండేషన్ ఫౌండర్ సాయి కుమార్, సాయి రేవంత్, సభ్యులు పాల్గొన్నారు.
Also Read: వైఎస్ జగన్ విజన్ కు ప్రతిరూపం భోగాపురం ఎయిర్ పోర్ట్ – జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను
