Madvi Hidma

Madvi Hidma

  • మారేడుమిల్లిలో ఎదురుకాల్పులు
  • ఆరుగురు మావోయిస్టుల మృతి
  • మృతుల్లో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో మోస్ట్‌వాంటెడ్‌ మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా, ఆయన భార్య రాజే, అనుచరులు మల్లా, దేవే, చెల్లూరి నారాయణ అలియాస్‌ సురేశ్‌, టెక్‌ శంకర్ ఉన్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఆ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్‌ కొనసాగుతున్నట్లు ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం నేపథ్యంలో కూంబింగ్‌ నిర్వహించినట్లు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోనూ ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం ఉదయం ఎర్రబోరు ప్రాంతంలో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు. ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు జిల్లా ఎస్పీ కిరణ్‌ చవాన్‌ తెలిపారు.

గెరిల్లా దాడుల వ్యూహకర్త

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూర్వాటి గ్రామంలో జన్మించిన మద్వి హిడ్మా.. బస్తర్‌ ప్రాంతంలో దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. చిన్నవయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుపొందారు. పీపుల్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ కమాండర్‌గా, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడిగానూ పనిచేశారు. మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితుడై 17 సంవత్సరాల వయసులోనే పార్టీలో చేరాడు. మురియా తెగకు చెందిన హిడ్మాకు ఇంగ్లీష్‌, హిందీ, గోండు, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో పట్టుంది. దండకారణ్యంలో పార్టీశ్రేణుల్ని ముందుండి నడిపించడంలో ఆరితేరారు. భారీ దాడులకు వ్యూహకర్తగా గుర్తింపు ఉంది. అడవుల్లోని కేంద్ర బలగాల క్యాంపులపై మెరుపు దాడులు నిర్వహించడంలో నిష్ణాతుడు. ఈ క్రమంలోనే మిలిటరీ దాడులకు మారుపేరైన పీఎల్‌జీఏలో ఒకటో బెటాలియన్‌కు సారథ్యం వహిస్తున్నారు. ప్రతి భారీ దాడిలో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్‌ వాంటెడ్‌గా మారారు. కొంతకాలం క్రితం కేంద్ర కమిటీలో స్థానం సంపాదించాడు. సాధారణంగా ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల వారు అత్యధికంగా ఉంటారు. కానీ, సుక్మా నుంచి ఈ స్థానంలోకి వెళ్లిన తొలి వ్యక్తి ఇతడే. పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) నంబర్‌ 1 బెటాలియన్‌కు హిడ్మా నేతృత్వం వహిస్తున్నాడు. దీనిలోని సభ్యులు అత్యాధునిక ఆటోమేటిక్‌ ఆయుధాలను వినియోగిస్తారు. ఈ బెటాలియన్‌లో 350 వరకు ఉంటారని సమాచారం. దళాలపై దాడులు చేశాక.. అపహరించిన అత్యాధునిక ఆయుధాలు, బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లను ఈ బెటాలియన్‌ ఎక్కువగా వాడుతుంటుంది. వీరు పూర్తిగా యూనిఫామ్‌లో ఉంటారని సమాచారం.

రెండు దశాబ్దాలుగా ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో ఇతడి ప్రమేయంతోనే చాలా దాడులు జరిగినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. చింతల్నార్‌, డోర్నాపాల్‌, తాడిమెట్ల, మినప.. ఇలా భారీగా ప్రాణనష్టం జరిగిన అనేక ఆపరేషన్లలో హిడ్మా స్వయంగా పాల్గొని 200 మందికి పైగా పోలీసు సిబ్బంది మృతికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యాడని సమాచారం. 2010లో దంతెవాడలో జరిగిన దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులయ్యారు. 2013లో జైరామ్‌ ఘాటీలో జరిపిన మెరుపుదాడిలో 27 మంది మరణించారు. వీరిలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు కూడా ఉన్నారు. 2021లో సుక్మా-బీజాపుర్‌లో జరిగిన మెరుపుదాడిలో 22 మంది భద్రతా సిబ్బంది మృతిచెందారు. హిడ్మా స్థానిక ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి కావడంతో అతడికి గ్రామస్థుల మద్దతు లభించేది. దీంతో బలమైన ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొన్నాడు. అతడు ఉన్న ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల అవతల భద్రతా దళాల కదలికలు కూడా అతనికి తెలిసిపోతాయి. హిడ్మా కోసం కొన్నేళ్లుగా ఛత్తీస్‌గఢ్‌ పోలీసులతోపాటు సీఆర్పీఎఫ్‌ కోబ్రా బలగాలు, తెలంగాణ గ్రేహౌండ్స్‌ బలగాలు విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో కర్రెగుట్టల నుంచి మొదలుకొని అబూజ్‌మడ్‌ పర్వతాలతోపాటు నేషనల్‌ పార్కులో భద్రతా దళాలు అణువణువూ జల్లెడ పట్టాయి. దండకారణ్యంలో వేలాదిగా సాయుధ బలగాలు కూంబింగ్‌ నిర్వహించగా.. అనేకమంది మావోయిస్టు అగ్రనేతలు వరుసగా ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు హిడ్మా కూడా తన బెటాలియన్‌తో కలిసి నేషనల్‌ పార్క్‌లోనే ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానించాయి. ఆ సమయంలో అతడి తాజా ఫొటో ఒకటి బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. జనవరిలో భద్రతా బలగాలు తన స్థావరాన్ని చుట్టుముట్టడానికి కొన్ని గంటల ముందే హిడ్మా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత సమీపంలోని ఓ కొండల ప్రాంతంలో నక్కినట్లు తెలిసింది. ఓ సమయంలో హిడ్మా లొంగిపోనున్నాడనే ప్రచారం కూడా జరిగింది. భద్రతా బలగాల కూంబింగ్‌ నిరంతరం కొనసాగుతుండటంతో హిడ్మా బృందం.. ఛత్తీస్‌గఢ్‌ నుంచి మకాం మార్చేందుకు ఆంధ్రా సరిహద్దులను పరిశీలించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మారేడుమిల్లి సరిహద్దు మీదుగా వీరు ఆంధ్రాలోకి ప్రవేశించారని, అక్కడి నుంచి ఒడిశా వెళ్లేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నాయి. వీరి కదలికలపై సమాచారం అందడటంతో భద్రతా బలగాలు తాజా ఆపరేషన్‌ను చేపట్టాయి.

కృష్ణా జిల్లాలోనూ సోదాలు

మరోవైపు కృష్ణా జిల్లా పెనమలూరు పరిధిలో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. కొత్త ఆటోనగర్‌లో తనిఖీలు చేపట్టి.. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉంటున్నారన్న సమాచారంతో కేంద్ర బలగాలు పెనమలూరుకు చేరుకున్నాయి. అల్లూరి జిల్లా మారేడుమిల్లి వద్ద ఎన్‌కౌంటర్‌ జరిగిన నేపథ్యంలో ఇక్కడ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్నవారు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టులుగా సమాచారం.

31 మంది మావోయిస్టుల అరెస్ట్

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారని ఏపీ ఇంటెలిజెన్స్‌ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా తెలిపారు. మంగళవారం ఉదయం 6.30-7.00 గంటల మధ్య భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని చెప్పారు. ఎన్‌కౌంటర్‌ వివరాలను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దార్‌తో కలిసి ఆయన వెల్లడించారు. రెండు రోజులుగా ఇంటెలిజెన్స్‌ సమాచారంతో గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టామని మహేశ్‌చంద్ర లడ్డా తెలిపారు. కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందని చెప్పారు. మావోయిస్టుల నుంచి వివిధ రకాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు ఏడీజీ మహేశ్‌ చంద్ర లడ్డా తెలిపారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు.

ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం

పోలీసులు పలు ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి వివరాలు…
ఏకే-47 – 2 పిస్టల్‌ -1
రివాల్వర్‌ -1
సింగిల్‌ బోర్‌ ఆయుధం -1
ఎలక్ట్రికల్ డిటోనేటర్లు -1525
నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు -150
ఎలక్ట్రికల్ వైర్ బండిల్ -1
కెమెరా ఫ్లాష్ లైట్ -1
కటింగ్‌ బ్లేడ్ -1
ఫ్యూజ్ వైర్ -25 మీటర్లు
కిట్ బ్యాగులు -7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *