డాక్టర్ సత్యవతికి జయంతి రామలక్ష్మణమూర్తి స్మారక పురస్కారం
Grandalaya varotsavalu
గ్రంథాలయాలకు అమూల్యమైన సేవలు అందించి చిరస్మరణీయుడిగా నిలిచిన జయంతి రామలక్ష్మమూర్తి స్మారక పురస్కారాన్ని సీతం కాలేజ్ చీఫ్ లైబ్రేరియన్ డాక్టర్ ఎల్ సత్యవతికి ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు సముద్రాల గురు ప్రసాద్ తో కలిసి మాజీ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మీ ప్రదానం చేశారు.ఏపీ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో సీతం కాలేజీలో జరిగిన గ్రంథాలయ వారోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ ఝాన్సీ లక్ష్మీ మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలుగా నిలిచాయని ,విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు .అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థానాలకు చేరిన వ్యక్తులను తీర్చిదిద్దినవి పుస్తకాలేనని అన్నారు

గురు ప్రసాద్ మాట్లాడుతూ పుస్తకాలు అంటే కేవలం కాగితాల గుచ్చాలు కాదు.పుస్తకాలు చీకటి కవాటాలు తెరిచి వెలుతురు వాకిళ్ళ ఎదుట నిలబెడతాయి అని ,పుస్తకాలు మస్తిష్క వికాస సాధనాలని,పుస్తకం చదివితే మస్తకం వికసిస్తుందని అన్నారు .కార్యక్రమాన్ని కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు పిన్నింటి కళావతి,ప్రధాన కార్యదర్శి ఎం సుభద్ర దేవి ,కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డివి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
