డాక్టర్ స్వప్న హైందవికి మహిళా దినోత్సవ పురస్కారం

Women's Day Award for Dr. Swapna Hindavi

Women's Day Award for Dr. Swapna Hindavi

మహిళా సాధికారితకు సమానత్వమే పునాది అని ప్రముఖ సాహితీవేత్త, శ్రీ వాగ్దేవీ సమారాధనమ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో ది సన్ స్కూల్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళాదినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడుతూ అవసరానికి ఆసరాగా నిలిచే ధీరత్వం, ఎంతటి క్లిష్ట పరిణామాలనైనా ఎదుర్కొనే నేర్పరితనం, భూమాతకే అబ్బురం అనిపించేంత సహనం మహిళల స్వంతం అని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గురుప్రసాద్ మాట్లాడుతూ స్త్రీ మూర్తి పురుషుడి వెనుక ఉంటే బలం, ముందు ఉంటే కవచం. పక్కనే ఉంటే జీవితాన్ని వసంతంగా మార్చేసే అద్భుతమని అన్నారు.ఆమె మౌనంతో మాట్లాడగలదు. నిశ్శబ్దానికి టీకా రాయగలదు. అక్షరాలకు అతీతమైన భాషలో మహిళ మహాపండితురాలని పేర్కొన్నారు. జననియే జగతికి ఆధారం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ పూర్వ అధ్యక్షులు పెనుగొండ కామరాజు, సన్ స్కూల్ కరస్పాండెంట్ మామిడిపాక అనిల్ కుమార్, పిన్నింటి కళావతిలతో కలసి జ్యోతి ప్రజ్వలనం చేసారు. ఈ సందర్భంగా లయ లాస్య డాన్స్ అకాడమీ విద్యార్ధులు, అతిభినయ కళాక్షేత్రం విద్యార్ధులు తమ నృత్య ప్రదర్శనలతో అలరించారు. ప్రముఖ గాయనీమణులు శైలజా కుమారి, ఎం హాసిని తమ గాత్రంతో ఆకట్టుకున్నారు. 2026 సంవత్సరానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కారాన్ని డాక్టర్ స్వప్న హైందవికి ఎపి గ్రంథాలయ సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ , పెనుగొండ కామరాజుతో కలిసి ప్రదానం చేసారు. ఈ సందర్భంగా బాలరామాలయ నిర్మాత కుసుమంచి సుబ్బారావుకు ఘనంగా సత్కరించారు. ప్రపంచ ఆర్యవైశ్య మహా సభ ఉత్తరాంధ్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పలుకూరి ప్రభావతి, సంఘం కార్యదర్శి సుభద్రాదేవి, తాడేపల్లి నాగేశ్వరరావు, డి వి సత్యనారాయణ, డిమ్స్ రాజులు ఉత్తమ విద్యార్ధులకు పతకాలను, ప్రశంసా పత్రాలను ప్రదానం చేసారు. ఈ సమావేశంలో సన్ స్కూల్ డీన్ రంగా, అకడమిక్ కో ఆర్డినేటర్ వసుధ, శ్వేత, ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్ పర్సన్ గోటేటి హిమబిందు, సంతోషి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *