రాబోయే పదేళ్లలో ఏపీలో ఊహించని అభివృద్ధి – సీఎం చంద్రబాబు
జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.15వేలు ఆదా అవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో నగరంలోని పున్నమిఘాట్ వద్ద నిర్వహించిన దీపావళి వేడులకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘‘దసరా అంటే విజయవాడ గుర్తొచ్చేలా.. వైబ్రెంట్ విజయవాడ సొసైటీ ఆధ్వర్యంలో దసరా ఘనంగా చేశారు. నరకాసురుడి హత్య జరిగిన రోజున దీపావళి జరుపుకొంటున్నాం. 2019-24 మధ్య రాష్ట్రాన్ని పట్టి పీడించిన రాక్షసుడిని ప్రజలు ఓడించారు. మళ్లీ రాష్ట్రంలో వైకుంఠపాళి వద్దు.. మళ్లీ వైకుంఠపాళి వస్తే నాశనమవుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఏపీకి అన్ని పనులు జరుగుతున్నాయి. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టాం. చరిత్రలో ఎన్నడూ ఇవ్వని విధంగా పింఛన్లు, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం.
అమరావతిలో పనులు మళ్లీ ట్రాక్‌లో పడ్డాయి. మూడేళ్లలో రూ.60వేల కోట్ల విలువైన పనులు పూర్తి చేస్తాం. ఏపీలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది. ఏఐ వల్ల పదేళ్లలో ఊహించని అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతుంది. ఏఐకి చిరునామాగా ఏపీ ఉంటే విశాఖ దానికి హెడ్ క్వార్టర్‌గా ఉంటుంది. రాజకీయ మూర్ఖత్వంతో ఇష్టానుసారం మాట్లాడే వ్యక్తులు బాగుపడరు.. వారి మాటలు ప్రజలు విశ్వసించరు’’ అని సీఎం అన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ లేదా డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర నెంబర్ 1గా ఉంటే ప్రతీ పేద కుటుంబం ఉన్నత స్థానంలో ఉంటుందన్నారు. ప్రజలు ఆనందంగా ఉండేందుకు విజయవాడలో శని, ఆదివారాలు ఆహ్లాదకర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
