అవినీతి కూపంలో కూటమి ప్రభుత్వం – మాజీ మంత్రి బొత్స
YSRCP district level meeting
YSRCP district level meeting: అబద్దపు వాగ్దానాలతో గద్దనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం… 18 నెలల కాలంలోనే అవినీతి కూపంలో కూరుకు పోయిందని శాసన మండలి ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఏ కార్యాలయంలోకి వెళ్ళినా అధికారులు ముందు మన ముఖం చూడట్లేదని… జేబులు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ అవినీతిని అరికట్టకపోతే… దానిలోనే కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుందన్నారు. అయితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మనం ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. పూల్‌బాగ్ రోడ్డులో గల జగన్నాథ్ ఫంక్షన్ హాల్ బుధవారం నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), మాజీ మంత్రి పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జీలు, వైసీపీ ముఖ్య నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్ష వర్ధన్ రెడ్డి సచివాలయ, గ్రామ స్థాయి కమిటీల నియామకంపై వారు దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫిబ్రవరి 15వ తేదీలోగా గ్రామ, సచివాలయ స్థాయి కమిటీల నియామకం పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

YSRCP district level meeting: ఈ సందర్భంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మాట్లాడుతూ… ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశం భారత్ అని చెప్పుకుంటున్నామని… అటువంటి దేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రధాని మోదీ ను ప్రశ్నించారు. పల్నాడులో రెండేళ్లు గా 200 కుటుంబాలని ఊరు బహిష్కరణ చేసి, ఒక వ్యక్తిని టీడీపీ గుండాలు హత్య చేసారన్నారు. అతడిని దహనం చేయడానికి వచ్చిన వారిని పోలీసులు ఆధార్ అడుగుతున్నారంటే రాష్ట్రంలో సాగుతున్న దుష్ట పాలనకు అద్దం పడుతోందని ద్వజమెత్తారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కూటమి నాయకులు ఆటవిక పాలన చేస్తున్నారన్నారు. పోలీస్ స్టేషన్లు నాయకుల కంట్రోల్ లో ఉండడమా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతం కాదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దుర్మార్గాలు చేయకండి. రేపు పదవుల్లో ఉండిపోరని గుర్తు పెట్టుకోండంటూ కూటమి నేతలను హెచ్చరించారు.

మే లేదా జూలై లో సర్పంచ్ , మున్సిపల్ ఎన్నికలు వస్తాయని. ఊరిలో అందరినీ ఒకేలా చూడాలని, ఒకడు మన వాడు అనుకుని సీట్లు ఇస్తే ఇంకొకడు పార్టీని వీడి పోతాడని వైసీపీ శ్రేణులకు సూచించారు. పదవిలో ఉండాల్సిన వ్యక్తి మన వాడా కదా అని కాకుండా పార్టీ పట్ల అంకిత భావం ఉన్నవాడా కాడా అని చూసి ఎంపిక చేయాలన్నారు. మార్చి నుంచి నియోజకవర్గ స్థాయిలో వారానికొక విస్తృత స్థాయి సమావేశం పెట్టుకుందాం. ఎన్నికలకు ముందు కేడర్ ను బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. త్వరలోనే ప్రతీ నియోజకవర్గం నాయకులతోనూ జగన్మోహన్ రెడ్డితో సమావేశం ఉంటుందన్నారు. ప్రస్తుత వైసీపీ శ్రేణులంతా క్రియాశీలకంగా ఉన్న వారేనని… కేడర్ బలంగా ఉందని, మండల కమిటీలు అన్నీ పూర్తి చేయాలని నేతలు వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామ స్థాయి కమిటీల పరిశీలనకు పరిశీలకులు వచ్చారు. వారి పర్యవేక్షణలో వీటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. అధికారం కోల్పోవడం రాజకీయ పార్టీలకు కొత్త కాదు. గెలుపు ఓటములు సహజం… రాత్రి పగలులా ఆటోమేటిగ్గా గెలుపు ఓటములు రాజకీయాల్లో రావని… ఓటమి వెనుకున్న కారణాలను లోతుగా విశ్లేషించి… గెలుపుకోసం మరింత కష్టపడాలని ఆయన సూచించారు.
జగనన్న2.0 ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా పనిచేయాలి – వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో నేతల స్పష్టీకరణ
YSRCP district level meeting: మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ… ఏ పార్టీకైనా లీడర్, కేడర్ బలంగా ఉండాలన్నారు. మన లీడర్ జగన్మోహన్ రెడ్డి బలం ఏమిటో దేశ రాజకీయాల్లో ఉన్న నాయకులందరికీ తెలుసని అన్నారు. జగన్మోహన్ రెడ్డి బలం ముందు నిలువలేక… ఆయన్ని ఓడించడానికి బీజేపీ , టిడిపి, జనసేన ముఠా కట్టారని ఎద్దేవా చేశారు. ఆయన్ని ఢీకొట్టే బలం లేక మరో 15 ఏళ్లు ఇలా ముఠాగా ఉంటామంటూ చెప్పుకుంటున్నారని అన్నారు. కాబట్టి నియోజకవర్గానికి 15 వేల వైసీపీ లైఫ్ టైమ్ సైన్యాన్ని సిద్ధం చేసి… మళ్ళీ జగనన్న 2.0 ప్రభుత్వాన్ని తీసుకు వచ్చే విధంగా… ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ఆయన సూచించారు. ప్రజల మధ్యనే ఉంటూ ప్రజావ్యతిరేక కూటమి పాలనను ఎండగట్టాలని… అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దని భరోసా ఇచ్చారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మాట్లాడుతూ… అధికారం కోల్పోయామన్న నిరాశ నిస్పృహలకు గురి అవ్వకుండా… ప్రజా వ్యతిరేక పాలనపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ఆదేశాలతో అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ ప్రజల పక్షాన నిలబడ్డామన్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 4 లక్షల సంతకాలు సేకరించి పెద్ద ఎత్తున పోరాటం చేశామని గుర్తు చేశారు. కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వామ్యులైన ప్రజలకు వైసీపీ శ్రేణులకి శిరస్సు వంచి నమస్కారాలు తెలిపారు. ఈ ప్రభుత్వ వైఫల్యాలు వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
పార్టీ బలోపేతం అయ్యి 2029 లో మళ్ళీ అధికారంలోకి వస్తామని ఈ జిల్లాలో అన్నీ స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీను క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసుకోవడం కోసం అత్యవసరం అని, 27 అనుబంధ సంఘాలకు కమిటీలను పూర్తి చేసుకోవాల్సి ఉందని, మండల కమిటీలు త్వరగా పూర్తి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 2019-24 లో తాము చేసిన అభివృద్ధి తప్ప… ఈ కూటమి ప్రభుత్వం ఒక్క పని అయినా చేశారా అని ఈ కూటమి నేతలను సూటిగా ప్రశ్నించారు. నాడు ఎయిర్ పోర్టుకు 2700 ఎకరాల భూమి ఇచ్చిన రైతులు వైఎస్సార్ సీపీ సానుభూతి పరులనే వాస్తవాన్ని కూటమి నేతలు తెలుసుకోవాలన్నారు. తమ ఐదేళ్లలో సుమారు 5 వేల కోట్ల నిధులతో ఈ జిల్లాలో అభివృద్ధి పనులు చేశామని, ఈ కూటమి ప్రభుత్వంలో ఒక్క కొత్త పింఛన్ ఐనా ఇచ్చారా అని పింఛన్లు మంత్రిను ప్రశ్నిస్తున్నా అన్నారు. రైతులు లాఠీ దెబ్బలు తింటేనే గానీ యూరియా దొరకని పరిస్థితిని ఈ జిల్లా రైతాంగం చవిచూసిందన్నారు. ఇక్కడి ప్రజాప్రతినిధులందరి దారి అవినీతి దారని, అందినకాడికి దోచుకుని ఇల్లు చక్క బెట్టుకొని వెళ్ళిపోయే విధంగా వారి తీరు ఉందన్నారు.

YSRCP district level meeting: వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పితే ఈ రెండేళ్లలో ఒక్క కొత్త అభివృద్ధి కార్యక్రమం జరగలేదు అన్నారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణం వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన క్రెడిట్ అని, ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం రోజున అన్ని నియోజక వర్గాల్లో వైఎస్సార్ సీపీ కేడర్ విజయోత్సవ సంబరాలు చేసుకుందామని పిలుపునిచ్చారు. పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తల పై కేసులు పెడుతున్నారని వారికి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అన్నారు. ఫిబ్రవరి 19 తర్వాత ప్రారంభించుకుని పార్టీ కార్యక్రమాలు అన్నీ అక్కడ నుంచే నిర్వహించుకుంటామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి, జిల్లాలో బొత్స సత్యనారాయణ నేతృత్వంలో భారీ విజయాలతో విజయ దుందుంబి మ్రోగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

YSRCP district level meeting: ఈ సమావేశంలో మాజీ ఎంపీ,పి.ఏ.సి.మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), జిల్లా పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు సమన్వయకర్తలు బొత్స అప్పల నరసయ్య, బడ్డుకొండ అప్పల నాయుడు, కడుబండి శ్రీనివాసరావు, డా. రాజేష్ తలే, సంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు, ఎమ్మెల్సీలు కుంబా హరి బాబు, డా. పెనుమత్స సురేష్ బాబు, విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మీ, విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు కిల్లి సత్యనారాయణ, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు శోభా హైమవతి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శోభా స్వాతి రాణి, నెల్లిమర్ల అసెంబ్లీ పరిశీలకులు నెక్కల నాయుడుబాబు, విజయనగరం, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాలు పరిశీలకులు కె.వి.సూర్యనారాయణ రాజు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురం జగన్ మోహన్ రావు, యువనాయకురాలు డా.బొత్సా అనూష, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షులు బడ్డుకొండ ప్రదీప్ నాయుడు, జిల్లా పరిధిలో ఉన్న అనుబంధ విభాగాలు అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
Also Read: వైఎస్ జగన్ విజన్ కు ప్రతిరూపం భోగాపురం ఎయిర్ పోర్ట్ – జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను
