వైఎస్ జగన్ విజన్ కు ప్రతిరూపం భోగాపురం ఎయిర్ పోర్ట్ – జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను
Majji Srinivasarao
Majji Srinivasarao on Airport: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) విజన్ కు ప్రతిరూపం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అని ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షులు, మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తెలిపారు. అయితే భోగాపురం ఎయిర్ పోర్ట్ పై అధికార కూటమి ప్రభుత్వం చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలని, ప్రాజెక్టు క్రెడిట్‌ను దొంగిలించేందుకు కూటమి నాయకులు తాపత్రయపడటం హాస్యాస్పదమని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం ధర్మపురిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం పాత్ర మరియు వైఎస్ జగన్ యొక్క కృషిని ఆయన వివరించారు. ఈ మీడియా సమావేశంలో వైసీపి రాష్ట్ర కార్యదర్శులు కెవి సూర్యనారాయణ రాజు, నెక్కల నాయుడు బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు జైహింద్ కుమార్,మండల పార్టీ అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ, పతివాడ అప్పలనాయుడు, మాజీ జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ఎయిర్ పోర్ట్ ముసుగులో భూ కుంభకోణంకు తెరతీసిన టీడీపీ
Majji Srinivasarao on Airport: ఈ సందర్భంగా జెడ్పీ చైర్మెన్ చిన్న శ్రీను మాట్లాడుతూ… 2014లో అధికారంలోనికి వచ్చిన చంద్రబాబు నాయుడు… ఎయిర్పోర్ట్ పేరుతో వేలాది ఎకరాల భూములను కొట్టేయాలని చూశారని విమర్శించారు. అమరావతి, హైటెక్ సిటీ తరహాలోనే ఇక్కడ కూడా 15,000 ఎకరాలను సేకరించాలని ప్రయత్నించి రైతులను ముఖ్యంగా వైసీపీ సానుభూతి పరులను ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. ఆనాడు రైతుల పక్షాన నిలబడి వైఎస్ జగన్ గారు చేసిన పోరాటం వల్లే బాబు వెనక్కి తగ్గాల్సి వచ్చిందని తెలిపారు. అయితే అప్పటి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్, జనసేన నాయకులు లోకం నాగమాధవి, టీడీపీ నాయకుల భూములను భూ సేకరణ నుండి మినహాయించి… కేవలం వైసీపీ సానుభూతి పరుల భూముల్లోనే ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టే విధంగా డిజైన్ చేసారన్నారు. అంతేకాదు 2019 సార్వత్రిక ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు టీడీపీ నాయకులతో కలిసి హడావుడిగా ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసారని… అందులో జీఎంఆర్ ప్రతినిధులు గాని, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గాని పాల్గొనకపోవడం టీడీపీ పబ్లిసిటీ పిచ్చికి నిదర్శనమన్నారు.

భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ వైసీపీదే
అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై పత్యేక దృష్టి సారించి… త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. దీనిలో భాగంగా సీఎం వైఎస్ జగన్… కేవలం 2,200 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించి… భూసేకరణ, NOC, కోర్టు కేసులు మరియు పరిహారం వంటి అన్ని అడ్డంకులను తొలగించారని వివరించారు. సుమారు 5 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులో చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించి… వారికి పునరావాసం ఏర్పాటు చేసిన అనంతరం… ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి జీఎంఆర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన స్పష్టం చేసారు. అనంతరం 2026 జూన్ నాటికి ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తయ్యే విధంగా పక్కా ప్రణాళికతో జీఎంఆర్ (GMR) అధినేత గ్రంధి మల్లికార్జునరావుతో కలిసి మే 3, 2023న శంకుస్థాపన చేసి… కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చేనాటికి యాభైశాతం పైగా పనులు పూర్తి చేసారని ఆయన స్పష్టం చేసారు. కేవలం వైఎస్ జగన్ విజన్, కృషి ఫలితం వలనే నిన్నటి రోజుల వాలిడేషన్ ఫ్లైట్ ల్యాండింగ్ విజయవంతంగా పూర్తయిందని ఆయన తెలిపారు. ఈ విజయం ఉత్తరాంధ్ర ప్రజలందరికీ గర్వకారణమని… దీనికి అహర్నిసలు శ్రమిస్తూ శరవేగంగా ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపడుతున్న జీఎంఆర్ సంస్థ అధినేత, ఈ ప్రాంత వాసి గ్రంధి మల్లికార్జునరావుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

కూటమి నాయకులది పబ్లిసిటీ పిచ్చి – టెంకాయల రాజకీయం
Majji Srinivasarao on Airport: అయితే పబ్లిసిటీ కోసం భోగాపురం ఎయిర్ పోర్టు (Alluri Sitarama Raju International Airport) నిర్మాణానికి టెంకాయి కొట్టి అప్పట్లో జిమ్మిక్కులు చేసిన టీడీపీ నాయకులు… జగన్ కృషితో పూర్తవుతున్న ఎయిర్ పోర్ట్ నిర్మాణం క్రెడిట్ ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయితే టీడీపీ నాయకుల ‘క్రెడిట్ చోరీ’ ప్రయత్నాలు రాష్ట్ర ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని ఆయన స్పష్టం చేసారు.

రైతులకు బస్తా యూరియా ఇవ్వలేని నాయకులు ఎయిర్ పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు
భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేసిన ఘనత వైసీపీకు దక్కుతుందని… అయితే తమకు తెలిసిన, అలవాటైన మీడియా జిమ్మిక్కులతో టీడీపీ నాయకులు యధావిధిగా క్రెడిట్ చోరీకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిలో భాగంగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు కూడా వారి బాటలోనే నడుస్తూ వైసీపీపై విమర్శలు చేస్తున్నాన్నారు. సీనియర్ నేతగా అతనిపై అమితమైన గౌరవం ఉందని… కాని టీడీపీ అధిష్టానం వద్ద మార్కుల కోసం జూనియర్ నాయకుల వలే అసత్యాలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ముందు చీపురుపల్లి నియోజకవర్గంలో రైతులకు అవసరమైన బస్తా యూరియా ఇవ్వాలని సూచించారు. అంతేకాదు రైతులకు బస్తా యూరియా ఇవ్వలేని వారు… ఎయిర్ పోర్ట్ కట్టారు అంటే ప్రజలు ఎలా నమ్ముతారని చురకలు అంటించారు.

Also Read: మిల్లర్లపై మంత్రి నాదేండ్ల ఆగ్రహం
