గ్యాస్ కొరత వస్తే హోటల్ రంగం మూతే-ఏపీ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్

Srinivas, President of the AP Hotel Association

Srinivas, President of the AP Hotel Association

పశ్చిమ ఆసియా దేశాలలో నెలకొన్న యుద్ద సంక్షోభం కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన విజయనగరం జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. వాసు తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్యాస్ కొరతను దృష్టిలో పెట్టుకుని పది రోజులు ముందుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అసోసియేషన్ తరపున ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని చెబుతున్నా,వాస్తవానికి తమ హోటల్స్ కు తగినంత గ్యాస్ సరిపడా కావడం లేదని తెలిపారు. గ్యాస్ డీలర్లు కూడా సరఫరా పై చేతులెత్తేసారని వివరించారు. ఇదే విధంగా కొన్ని రోజులు పరిస్థితి ఉంటే హోటల్స్, రెస్టారెంట్లు మూసివేసే అవకాశం ఉందన్నారు. హోటల్ రంగం మూతపడితే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దూరమవుతుందని తెలిపారు. ఇప్పటికే కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులతో హోటల్ రంగం అల్లాడిపోతుందని, అలాగే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బిజీగా ఉండే సమయంలో గ్యాస్ కొరత మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే హోటల్ రంగానికి సరిపడా గ్యాస్ సరఫరా చేయాలని, ప్రస్తుతం ఉన్న గ్యాస్ ను బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా పర్యవేక్షణ చేయాలని కోరారు.

విజయనగరం జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. వాసు మాట్లాడుతూ జిల్లాలో అనేకమంది అద్దె భవనాలలో హోటల్స్ నిర్వహిస్తున్నారని, గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యలు వినియోగించేందుకు భవన యజమానులు అంగీకరించడం లేదని తెలిపారు. వాస్తవానికి విజయనగరానికి ఉన్న డిమాండ్ ను బట్టి గ్యాస్ సరఫరా కావడం లేదని తెలిపారు. ఈ పరిస్థితి కొనసాగితే హోటల్స్ నడపడం సాధ్యం కాదని అన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 25న ఒంగోలు పట్టణంలో అన్ని జిల్లాల అసోసియేషన్ లతో సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశంలో తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బాబురావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్, టి అనిల్,జిల్లా అసోసియేషన్ కార్యదర్శి కాళ్ళ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *