డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన మంత్రి కొండపల్లి
The minister inaugurated the digital computer lab.
విద్యార్థులు తమ ఎదుగుదలకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ, పేదరిక నిర్మూలన, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తమ సందేహాల నివృత్తికి, అవసరమైన సమాచారం కోసం చాట్ జిపిటి లాంటి కృత్రిమ మేధ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు. గంట్యాడ మండలం బుడతనాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కంప్యూటర్ డిజిటల్ ల్యాబ్ ను మంత్రి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. పేటీఎం సహకారంతో బిఆర్ఈడిఎస్ స్వచ్ఛంద సంస్థ 10 డెస్క్ టాప్ కంప్యూటర్లతో ఈ డిజిటల్ ల్యాబ్ ను ఏర్పాటు చేసింది. వీరికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కంప్యూటర్ ను ఉపయోగించి ఇంటర్నెట్ ద్వారా ప్రపంచాన్ని అనుసంధానం చేసుకోవచ్చునని అన్నారు. ప్రస్తుతం కంప్యూటర్, ఇంటర్నెట్ లేనిదే ఏ పని జరిగే పరిస్థితి లేదన్నారు. 65 ఏళ్లు చరిత్ర గల బుడతనాపల్లి పాఠశాలలో కంప్యూటర్ డిజిటల్ ల్యాబ్ ను ఏర్పాటు చేయడం వలన, విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. డీఎస్సీలో, వివిధ పోటీ పరీక్షల్లో ఈ పాఠశాల విద్యార్థులు ఎంతగానో ప్రతిభ చూపుతున్నారని అభినందించారు.

డి ఈ ఓ మాణిక్యం నాయుడు మాట్లాడుతూ, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లాలో విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఏ పాఠశాలలో సమస్య ఉన్న తక్షణమే మంత్రి స్పందించి పరిష్కరిస్తున్నారని చెప్పారు. చదువు ద్వారానే గొప్ప భవిష్యత్తును సాధించగలమని, ఆడపిల్లలు కూడా బాగా చదువుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గజపతినగరం ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, పేటీఎం అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అంబుజ్ రస్తోగి, సీనియర్ మేనేజర్ ఎస్ వి సత్యనారాయణ, బ్రెడ్స్ సీఈవో రామకృష్ణ రాజు, ఎంఈఓ 2 వెంకట్రావు, హెచ్ఎం సుబ్రహ్మణ్యం స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
……..
