మాజీ మంత్రి అంబటిపై టీడీపీ దాడులను ఖండిస్తున్నాం – వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను
Majji Srinivasarao
Majji Srinivasarao slams TDP: గుంటూరు జిల్లా గోరంట్లలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) తో పాటు అతని ఇంటిపై టీడీపీ నాయకులు చేసిన దాడిని జిల్లా పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మెన్ మజ్జి శ్రీనువాసరావు (చిన్న శ్రీను) తీవ్రంగా ఖండించారు. ఓ మాజీ మంత్రి ఇంటిపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడి చూస్తే రాష్ట్రంలో అసలు ప్రజా స్వామ్యం ఉందా ? ప్రజల మాన ప్రాణాలకు అసలు రక్షణ ఉందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన ఎద్దేవా చేసారు. ఈ మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిని, విధ్వంసాన్ని ఖండిస్తూ శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రాన్ని రాజ్యాంగం కల్పించిందని… ప్రజా క్షేత్రంలో ఉన్న వారు రాజకీయ సిద్ధాంత పరమైన వ్యాఖ్యలు చేయడం, పాలనలోని లోపాలను ఎత్తి చూపడం సహజమని అన్నారు. అటువంటి వారిపై ప్రభుత్వమే తమ వర్గం రౌడీలు, ఉన్మాదులతో దాడులు చేయించడం, ఇళ్లపై పడి విద్వంసం సృష్టించడం అన్యాయం, అనైతికమని అన్నారు. నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ముఖ్య మంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు తమ పార్టీ గుండాలు, ఉన్మాదులతో మరో సీనియర్ రాజకీయ నాయకుడైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి పైకి దాడికి ఉసిగొల్పడం ప్రతీ ఒక్కరూ ఖండించ దగ్గ సందర్భమని అన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గుండాలు జరిపిన దాడి, విద్వంసం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజలను భయకంపితులను చేసేలా రౌడీ రాజ్యం రాజ్యమేలుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు.
Majji Srinivasarao slams TDP: కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు పావుగా వాడుకోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకుండా వైసీపీ మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు నాయుడు, లోకేష్ రాసుకున్న కక్షపూరిత రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని దుయ్యబట్టారు. రాష్ట్ర పోలీస్ శాఖ టీడీపీ అనుబంధం సంఘంగా మారిపోయిందా అని ప్రజలు అనుకునేలా పోలీసులు కూడా టీడీపీ కార్యకర్తలు మాదిరి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టుగా ఈ దాడి ఘటన స్పష్టం చేస్తుందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ గుండాలు కక్ష కట్టి మరీ వైసీపీ నేతలు, నాయకులను, సానుభూతి పరులపై దాడులు చేయిస్తూ హత్యా రాజకీయాలతో చలి కాచుకుంటున్నారని చిన్న శ్రీను విమర్శించారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి విధ్వంశ పూరిత ఘటనలు తలెత్తలేదని, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన సాగించారన్నారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి పాలన మొదలయ్యాక రాష్ట్రంలో లోకేష్ తన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రౌడీలతో రాజ్యమేలుతున్నారని దుయ్యబట్టారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజా స్వామ్యాన్ని కాపాడేలా కూటమి ప్రభుత్వ భాగస్వామ్య పార్టీలు ఆలోచించాలని చిన్నశ్రీను సూచించారు.
Also Read: వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి ‘యువ’ కళ
