దిల్లీ కాలుష్యంతో నేనూ ఇబ్బందిపడ్డా – సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌

CJI Suryakant

CJI Suryakant

CJI Suryakant on pollution: దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుడంతో.. అక్కడ గాలి నాణ్యత బాగా క్షీణించడంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ (Suryakant) ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం గంటపాటు వాకింగ్‌కు వెళ్లడంతో తనకు శ్వాస సంబంధిత సమస్యలు ఎదురైనట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విచారణలను వర్చువల్ మోడ్‌ కు మార్చడానికి బార్ అసోసియేషన్ అంగీకరిస్తే… కోర్టు ఏకరీతి నియమాన్ని రూపొందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గత రెండు వారాలుగా వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ)లు దారుణంగా పడిపోతుండడం.. తీవ్ర కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తుండడంతో 60 ఏళ్లు పైబడిన న్యాయవాదులు వ్యక్తిగతంగా కోర్టుకు రావడానికి బదులుగా వర్చువల్ విధానంలో విచారణకు హాజరు కావడానికి అనుమతించాలని సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది విజ్ఞప్తి చేశారు. మరో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సైతం రాకేష్‌ ద్వివేది వ్యాఖ్యలతో ఏకీభవించారు. 60 ఏళ్ల వయసులో తాము వాయు కాలుష్యంతో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. దీంతో సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ మాట్లాడుతూ.. తాను కూడా ఇబ్బంది పడుతున్నానన్నారు.

CJI Suryakant on pollution: జస్టిస్ పీఎస్‌ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్‌లతో ధర్మాసనం రెండు వారాల క్రితమే దిల్లీ కాలుష్యంపై న్యాయవాదులను హెచ్చరించింది. పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు న్యాయవాదులు స్వయంగా కోర్టుకు హాజరు కానవసరం లేదని.. వర్చువల్ హియరింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని లాయర్లకు సూచించింది. ఈ విషయంపై ప్రధాన న్యాయమూర్తితో చర్చిస్తామని తెలిపింది.

దేశ రాజధాని దిల్లీలో వాయు నాణ్యత సూచీ తీవ్రంగా పడిపోతుండడంతో పర్యావరణ శాఖ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే సిబ్బందిలో 50శాతం మంది ఇంటి నుంచే పనిచేయాలని, మిగిలిన సగం మంది మాత్రమే కార్యాలయాలకు రావాలని ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986లోని సెక్షన్‌ 5 నిబంధన ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపింది. నగరంలో వాహనాల రాకపోకలను తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 50శాతం మందికి ‘వర్క్‌ ఫ్రం హోం’ నిబంధనను అన్ని సంస్థలూ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

Also Read: చొరబాటుదారులు క్యాన్సర్‌ లాంటివారు – ఎంపీ కంగనా రనౌత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *