సచిన్‌ తెందూల్కర్ ను కలిసిన లోకేశ్‌ దంపతులు

Nara Lokesh with Sachin

Nara Lokesh with Sachin

Nara Lokesh with Sachin: ముంబై వేదికగా భారత్, దక్షిణాఫ్రికా ల మధ్య జరిగిన మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ కు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) … కుటంబ సమేతంగా హాజరయ్యారు. భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో పాటు జాతీయ జెండాను పట్టుకుని… భారత జట్టుకు మద్దత్తు తెలిపారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించి… మొట్టమొదటి సారిగా ప్రపంచ కప్ ను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఈ క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన ఫోటోలను మంత్రి నారా లోకేశ్… తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ లో పోస్ట్ చేసారు. ఐసీసీ చైర్మెన్ జైషా, అతని తల్లి సోనల్ షాతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేసారు.

Nara Lokesh with Sachin: ఈ సందర్భంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) ను కుటుంబ సమేతంగా నారా లోకేశ్ కలిశారు. సచిన్ తో కలిసి సెల్ఫీ దిగడంతో పాటు వేరువేరుగా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అంతేకాదు… ‘‘ఇది ఫ్యాన్‌ బాయ్‌ క్షణం. ఈ రోజు లెజెండ్‌ను కలిసే అదృష్టం లభించింది. ఆయన వినయం, ఆప్యాయతల గురించి ఇప్పటి వరకూ వినడమే. నేడు స్వయంగా చూశాను. తరతరాలకు ప్రేరణగా నిలిచిన క్రికెట్‌ దేవుడు ఆయన’’ అంటూ లోకేశ్‌ కామెంట్ పెట్టారు. అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌ జైషా, ఆయన తల్లి సోనల్‌ షాలను కలుసుకున్న లోకేశ్‌.. ‘‘బ్రాహ్మణితో కలిసి ఈ ఆత్మీయ క్షణాల్ని పంచుకోవడం ఆనందంగా ఉంది. వారితో ‘క్రికెట్, యువత భాగస్వామ్యం, క్రీడల భవిష్యత్తు’ గురించి మాట్లాడాను’’ అని పోస్టు చేశారు. దీనితో ప్రస్తుతం నారా లోకేశ్… సచిన్ తెందూల్కర్ తో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

మహిళల వరల్డ్‌కప్‌-2025 విజేతగా భారత్‌

భారత మహిళల జట్టు 47 ఏళ్ల తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్‌-2025 విజేతగా భారత్‌ నిలిచింది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా… తొలి వరల్డ్‌కప్‌ టైటిల్‌ను ముద్దాడింది. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవర్‌లో 246 పరుగులకు ఆలౌటైంది.

సౌతాఫ్రికా కెప్టెన్‌ లారా వోల్వార్డ్ట్ ఒంటరి పోరాటం చేసింది. 98 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 101 పరుగులు చేసింది. లారా క్రీజులో ఉన్నంతసేపు భారత డగౌట్‌తో పాటు అభిమానులలో టెన్షన్‌ నెలకొంది. దీప్తీ శర్మ బౌలింగ్‌లో వోల్వార్డ్ట్ ఔట్‌ కావడంతో భారత విజయం ఖాయమైంది. అమన్‌ జ్యోత్‌ కౌర్‌ అద్బుత క్యాచ్‌తో వోల్వార్డ్ట్ పెవిలియన్‌కు పంపించింది.

ఈ ‍మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ షఫాలీ వర్మతో బ్యాట్‌తో బంతితో మ్యాజిక్‌ చేసింది. భారీ లక్ష్య చేధనలో 51 పరుగుల వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది. బ్రిట్స్‌ రనౌట్‌ రూపంలో వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన బోష్‌ కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరింది. ఈ సమయంలో సౌతాఫ్రికా కెప్టెన్‌ లారా.. వన్‌ డౌన్‌ బ్యాటర్‌ లూస్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. భారత కెప్టెన్‌ హర్మన్‌ ఎంత మంది బౌలర్లను మార్చిన ఫలితం లేకపోయింది. దీంతో పార్ట్‌ టైమ్‌ బౌలర్‌ షఫాలీకి హర్మన్‌ బంతిని అందించింది. కెప్టెన్‌ నమ్మకాన్ని షఫాలీ వమ్ము చేయలేదు. అద్బుతమైన సన్నీ లూస్‌ను షఫాలీ బోల్తా కొట్టించింది. ఆ తర్వాత డేంజరస్‌ బ్యాటర్‌ కాప్‌ను కూడా వర్మ పెవిలియన్‌కు పంపింది. రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత్‌ను వరల్డ్‌ ఛాంపియన్‌గా షఫాలీ నిలిపింది.

ఇక భారత్‌ తొలిసారి వరల్డ్‌కప్‌ను సొంతం చేసు​కోవడంలో స్టార్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మది కీలక పాత్ర. తొలుత బ్యాటింగ్‌లో హాఫ్‌ సెంచరీతో మెరిసిన దీప్తి.. బౌలింగ్‌లో బంతితో అద్బుతం చేసింది. ఈ యూపీ క్రికెటర్‌ ఐదు వికెట్లతో ప్రోటీస్‌ పతనాన్ని శాసించింది. 9.3 ఓవర్లు బౌలింగ్‌ చేసిన శర్మ..39 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. మొత్తంగా 17 వికెట్లతో దీప్తి ప్లేయర్‌ ఆఫ్‌ది టోర్నమెంట్‌గా నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన మన అమ్మాయిల జట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 298 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. భారత ఇన్నింగ్స్‌లో షెఫాలీ వర్మ(78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. దీప్తి శర్మ(58 బంతుల్లో 58), రిచా ఘోష్‌(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34), మంధాన(45) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో అయబొంగా ఖాకా మూడు వికెట్లు పడగొట్టగా.. మలాబా, క్లార్క్‌, ట్రయాన్‌ తలా వికెట్‌ సాధించారు.

Also Read: విశాఖలో యువ దంపతుల ఆత్మహత్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *