10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి – జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Collector Ramsundar reddy
పదవ తరగతి విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ పూసపాటిరేగ మండలంలో విస్తృతంగా పర్యటించి వివిధ ప్రభుత్వ సంస్థలు, సేవా కేంద్రాల పనితీరును పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో అందుతున్న సేవలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఆరా తీసిన కలెక్టర్ పలు సూచనలు చేశారు.ముందుగా పూసపాటిరేగలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి రూపొందించిన యాక్షన్ ప్లాన్ను 10వ తరగతి ఉపాధ్యాయులతో కలిసి సమీక్షించి, విద్యార్థుల ఫలితాల మెరుగుదలపై దృష్టి సారించాలని సూచించారు. పాఠశాలలో అమలవుతున్న ఆహార మెనూను పరిశీలించి, నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.టాయిలెట్లు, భవనాల పరిశుభ్రత, మౌలిక వసతుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.అనంతరం అదే మండలం కుమిలి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ నెం.5ను సందర్శించారు.

చిన్నారుల బరువుల నమోదు, అందిస్తున్న పౌష్టికాహార మెనూ,పిల్లల గ్రోత్ చార్టుల నిర్వహణను పరిశీలించి, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం నిర్దేశించిన పోషకాహారం తప్పనిసరిగా అందేలా చూడాలని ఆదేశించారు. అనంతరం కుమిలి గ్రామ సచివాలయంను సందర్శించిన కలెక్టర్, సిబ్బంది అటెండెన్స్, హౌస్ హోల్డ్ సర్వే పురోగతి, గ్రామ సచివాలయం ద్వారా అందుతున్న ప్రభుత్వ సేవల అమలు తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ప్రజలకు సేవలు అందజేయడలో జాప్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. అదేవిధంగా, కుమిలి గ్రామంలోని వెల్నెస్ సెంటర్ను సందర్శించిన కలెక్టర్,ఇమ్యునైజేషన్ కార్యక్రమాల అమలు,హై రిస్క్ యాంటినేటల్ కేసుల గుర్తింపు, ఫాలోఅప్ తదితర అంశాలపై వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. గర్భిణీ స్త్రీలకు సకాలంలో వైద్య సేవలు అందించి, మాతా-శిశు మరణాల నివారణకు కృషి చేయాలని సూచించారు.
