దీపావళి వేడుకల్లో సతీసమేతంగా పాల్గొన్న సీఎం చంద్రబాబు

Chandrababu_Naidu_joins_Sati_in_Poonami_Ghat_celebrations_db5dd15f93_V_jpg--625x351-4g

దీపావళి పర్వదినం పురష్కరించుకుని విజయవాడ పున్నమి ఘాట్‌ వద్ద వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ‘సొసైటీ ఫర్‌ వైబ్రెంట్ విజయవాడ’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి సీఎం చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ‘జీఎస్టీ సెలబ్రేషన్స్‌ని దసరాతో ప్రారంభించి, దీపావళితో ముగిస్తున్నాం. గడిచిన అయిదేళ్లలో మనం ఇటువంటి పండగలు జరుపుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదు. సూపర్ జీఎస్టీ పండుగ చాలా చక్కగా వ్యాపారస్తులు జరుపుకుంటున్నారు. ఒకప్పుడు నాలుగు వస్తువులు కొంటే ఇప్పుడు అదనంగా మరో నాలుగు కొంటున్నారు. విజయవాడ ఫెస్టివల్ చాలా బాగా నిర్వహించారు. దసరా అంటే ఒకప్పుడు కలకత్తా గుర్తు వచ్చేది. కానీ ఇప్పుడు విజయవాడ గుర్తొచ్చే విధంగా ఫెస్టివల్ నిర్వహించారు.

దీపావళి పండక్కి చాలా విశిష్టమైన చరిత్ర ఉంది. నరకాసురుడనే రాక్షసుడు లాగానే మనకి కూడా 2019 నుంచి 2024 వరకూ మన రాష్ట్రంలో ఉన్నాడు. ఆనాడు నరకాసున్ని ఏ విధంగా తరిమికొట్టారో అదే విధంగా రాష్ట్రానికి పట్టిన రాక్షసుడిని తరిమికొట్టి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారు. మళ్లీ ఈ రాష్ట్రంలో వైకుంఠపాళీ వద్దు… ఈ పండగ రోజు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. రాష్ట్రంలో ఇప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది. వెంటిలేటర్ పై ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదే. అమరావతి పనులు గాడిలో పడ్డాయి. ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. సూపర్ జీఎస్టీ ద్వారా సూపర్ సేవింగ్ జరిగాయి. ప్రతి ఒక్క కుటుంబానికీ మేలు జరిగే విధంగా జీఎస్టీ రిఫార్మ్స్ వచ్చాయి’ అని చెప్పారు.

అలాగే జీఎస్టీ ద్వారా ఒక కుటుంబానికి దాదాపు రూ.15వేలు ఆదా అయ్యాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాబోయే మూడు సంవత్సరాల్లో అమరావతిలో 50 వేల నుంచి 60 వేల కోట్ల రూపాయల పనులు జరుగుతాయని చంద్రబాబు తెలిపారు. ‘హైటెక్ సిటీని తీసుకొచ్చి, ఐటీని హైదరాబాదులో ప్రోత్సహించాం. రాబోయే రోజుల్లో ఏపీ.. ఏఐ హబ్ గా మారబోతుంది. కొంతమంది ఇష్టానుసారం రాజకీయ మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రం ఏఐ ద్వారా పదేళ్లలో గణనీయమైన అభివృద్ధి సాధిస్తుంది. ప్రపంచంలో అందరికంటే తెలివైన వారు ఉండే స్థానంగా ఆంధ్రప్రదేశ్ ఉండబోతుంది. గూగుల్ ఎక్కడైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో ఆ దేశాలకు ఇక్కడ నుంచి సేవలందిస్తుంది. 2027 జూన్ లేదా డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం. గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. దానిని తిరిగి గాడిలో పెడుతున్నాం. ఎన్ని కష్టాలు ఉన్నా ఉద్యోగస్తులకూ మేలు చేస్తున్నాం’ అని చంద్రబాబు తెలిపారు.

ఈ సందర్భంగా పున్నమి ఘాట్ లో ఏర్పాటు చేసిన దీపావళి ఫైర్ క్రాకర్స్ సంబరాల్ని పిల్లలతోపాటు ఆనందంగా జరుపుకున్నారు చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి. అంతకుముందు చంద్రబాబు చేతుల మీదుగా పున్నమి ఘాట్ లో ఫైర్ క్రాకర్స్ ఫెస్టివల్ ప్రారంభమైంది. దివాళి ఫైర్ క్రాకర్స్ పున్నమి ఘాట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *