అమరావతిలో గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్‌ రూ.100 కోట్ల విరాళం

images

ఏపీ రాజధాని అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్ విరాళం ప్రకటించింది. శోభా గ్రూప్ సంస్థ అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు రూ.100 కోట్లు విరాళం ప్రకటించడంపై ప్రత్యేకంగా అభినందించారు. దుబాయ్ లోని ప్రముఖ రియాల్టి సంస్థ శోభా గ్రూప్ ఫౌండర్ చైర్మన్ పీఎన్సీ మీనన్‌తో సీఎం సమావేశం అయ్యారు.

పీ4 విధానంలో జీరో పావర్టీకి ప్రభుత్వ పరంగా చేస్తున్న ప్రయత్నాలను చంద్రబాబు వివరించారు. రాజధానిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నట్టు తెలిపారు. శోభా రియాల్టి సంస్థ కూడా ఇందులో భాగస్వామి కావాలని ఆహ్వానించారు. ఏపీకి వచ్చి రాజధాని నిర్మాణాన్ని పరిశీలించాలని పీఎన్సీ మీనన్‌ను కోరారు. శోభా రియాల్టీ లాంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సరైన గమ్యస్థానం ఏపీ అని వివరించారు. 3 ఏళ్లలో అమరావతిలో రహదారులు, నీటి సదుపాయం, నైపుణ్యం ఉన్న మానవ వనరులు వంటి మౌలిక సదుపాయాలు సిద్ధం అవుతాయని తెలిపారు. విశాఖలో గూగుల్ డేటా ఏఐ హబ్, అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు కానున్నాయని వివరించారు. రాష్ట్రంలోని తిరుపతి, విశాఖ, అమరావతి లాంటి నగరాలకు ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలు, కార్యక్రమాలను శోభా గ్రూప్ ఛైర్మన్ పీఎన్సీ మీనన్.. సీఎం చంద్రబాబుకు గుర్తు చేశారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని మీనన్‌ను సీఎం ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *