అన్నా నేహా థామస్‌కు నటరాజ పురస్కారం

Anna Neha Thomas receives Nataraja Award

Anna Neha Thomas receives Nataraja Award

ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య, తెలుగు భాషా పరిరక్షణ సమితి సంయుక్తంగా సీతం కళాశాలలో నిర్వహించిన సాంస్కృతిక వైభవం కన్నుల పండుగగా, వీనుల విందుగా సాగింది..పదనిసలు పల్లవించాయి. పదనర్తనలు పరవళ్లు తొక్కాయి. ప్రముఖ వీణ, గాత్ర విద్వాంసురాలు శైలజా కుమారి నేతృత్వంలో మహత్మా జ్యోతిబా ఫూలే బిసి వెల్ఫేర్ బాలికల పాఠశాలకు చెందిన విద్యార్ధులు దేశభక్తి గీతాలు ఆలపించారు. గాయత్రి నృత్య దర్శకత్వంలో వరలక్ష్మీ త్యాగరాజ సంగీత కళాశాల విద్యార్ధులు తమ నాట్యంతో,హర్షిత నృత్య దర్శకత్వంలో గీతాంజలి పాఠశాల విద్యార్ధులు తమ నృత్య ప్రదర్శనలతో ఆద్యంతం అలరించారు. నంది అవార్డు పురస్కార గ్రహీత దాసరి తిరుపతినాయుడు, కాగుపాటి నారాయణమూర్తి, ఎం వి సుధాకర్ పట్నాయక్‌లు హృద్యమైన పద్యాలను ఆలపించారు. కార్యక్రమంలో ముందుగా పాఠశాల డైరక్టర్ డాక్టర్ ఎం శశిభూషణరావు, ముళ్ళపూడి సుభద్ర దేవి, నాలుగెస్సులరాజు, పిన్నింటి సూర్యనారాయణ, కళావతి దంపతులతో కలసి జ్యోతి ప్రజ్వలనం చేసారు. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలలో నృత్య ప్రదర్శనలు గావిస్తూ విజయనగరం ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్న అన్నా నేహా అన్నాథామస్‌కు ప్రముఖ సంగీత విద్వాంసురాలు లక్ష్మీరామదాసుతో కలసి ఘంటసాల సంగీత సమాఖ్య వ్యవస్థాపకులు సముద్రాల గురుప్రసాద్ నటరాజ పురస్కారాన్ని ప్రదానం చేసారు. అన్నా నేహా థామస్ నృత్య ప్రదర్శనకు ప్రేక్షకులందరూ పరవశులయ్యారు. ఈ కార్యక్రమానికి కళాశాల మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగ అధిపతి డాక్టర్ వరూధిని సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి వి రామమూర్తి,డిమ్స్ కంప్యూటర్స్ రాజు, డి వి సత్యనారాయణ, పలుకూరి ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *