పురాతన విధానంలో సింహాచలం ఆలయం పైకప్పు మరమ్మతులు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం ఆలయం పైకప్పు మరమ్మతు పనులను పురాతన శాస్త్రీయ విధానంలో చేపట్టడం వల్ల మరో 200 ఏళ్లపాటు లీకేజీ సమస్యలు ఉత్పన్నం కావని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. పైకప్పు లీకేజీల నివారణ ప్రాజెక్టు పనులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆయన ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ… పుణెకు చెందిన లార్డ్ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రిలిజియన్ ట్రస్టు.. రూ.5 కోట్ల వ్యయంతో ఫిబ్రవరిలో ప్రారంభించిన పనులను… నిర్దేశించుకున్న గడువు కంటే ముందుగానే పూర్తి చేసిందని తెలిపారు.
కరక్కాయ, సున్నం, బెల్లం, బెండకాయ జిగురు తదితర పదార్థాల మిశ్రమాన్ని పైకప్పుమీద పూసి, సహజసిద్ధమైన రీతిలో లీకేజీలు నివారించారన్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి తదితర ప్రముఖ ఆలయాల్లో లీకేజీల నివారణ ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయని వివరించారు. గతంలో సిమెంట్, కాంక్రీట్‌తో లీకేజీల నివారణ పనులు చేపట్టినప్పటికీ ఫలితం ఇవ్వలేదని.. సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో ఇప్పుడు దానికి పరిష్కారం లభించిందన్నారు.
