దీపావళి పండుగ రోజు ‘దీపాలు’ ఎందుకు వెలిగిస్తారు ?

images (2)

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగకు సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి. నరకాసురుడిని శ్రీకృష్ణుడు సంహరించడం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రావడం, లక్ష్మీదేవి ఆవిర్భావం. పాండవులు అజ్ఞాతవాసం నుంచి పునరాగమనం- ఇవన్నీ కూడా దీపావళి పండుగతో ముడిపడి ఉన్నవే! దీపావళి ప్రధానంగా దీపాల పండుగ! ఈ రోజు దీపాన్ని లక్ష్మీదేవిగా భావించి పూజించడం సంప్రదాయం. అందుకే దీపావళి పండుగ విశిష్టతను ఈ కథనంలో తెలుసుకుందాం.

దీపావళి ఎంతో ప్రత్యేకం!

భారతీయ సంస్కృతిలో దీపావళి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. లోక కంటకుడైన నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా సంహరిస్తాడు. నరకుని పీడ విరగడైనందుకు సకల జనులు సంతోషంతో నరక చతుర్దశి రోజు దీపాలు వెలిగించి, బాణాసంచా మహోత్సవం జరిపారని, ఆనాటి నుంచి నరక చతుర్దశి, దీపావళి పండుగలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని హరివంశంలో వివరించి ఉంది. అలాగే నరకాసుర సంహారం గురించి శ్రీమద్భాగవతంలోని విష్ణు పురాణంలో కూడా వివరించి ఉంది.

నరక చతుర్దశి రోజు అభ్యంగన స్నానం ఎందుకు ఆచరించాలి ?

ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసురుని సంహారం జరిగింది కాబట్టి మూడో జాములో అభ్యంగన స్నానం ఆచరిస్తే నరక బాధలు ఉండవని శాస్త్ర వచనం. అందుకే నరక చతుర్దశి రోజు సూర్యోదయానికి ముందుగానే నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం ఆచరిస్తారు. ఈ రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ఈ రోజు శరీరానికి నువ్వుల నూనె రాసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో నరక చతుర్దశి రోజు గంగా స్నానం ఆచరిస్తారు.

దీపారాధన ప్రాశస్త్యం

నరక చతుర్దశి, దీపావళి రోజు చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంది. ‘నరక’ అనే శబ్దానికి యమలోకం అనే అర్థమని, అందుకే నరక విముక్తికై యమధర్మరాజు అనుగ్రహం కోసం యమదీపాలు పెట్టి, పూజించాలని వ్రత చూడామణిలో వివరించి ఉంది. ‘యమయా ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ’ అని పురాణాలు పేర్కొంటున్నాయి. అంటే జనులందరికి నరక బాధలు లేకుండా చేయడమే దీపావళి ఆంతర్యం అని అర్థం. ఇంతటి పౌరాణిక ప్రాశస్త్యాన్ని, ఆధ్యాత్మిక ఆంతర్యాన్ని కలిగి ఉన్న ఈ నరక చతుర్దశిని శాస్త్రంలో చెప్పినట్లుగా తప్పకుండా జరుపుకోవాలి.

దీపలక్ష్మీ నమోస్తుతే!

దీపావళి అంటేనే లక్ష్మీదేవి పూజ. ఇతర రోజుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపాలు వెలిగిస్తే దీపావళి రోజు మాత్రం దీపాన్నే లక్ష్మీదేవిగా భావించి పూజిస్తాం. నరకాసుర సంహారం అనంతరం అమావాస్య రోజు దీపాలు వెలిగించి దీపావళి పండుగ చేసుకోవడం సంప్రదాయం. దీపం నిత్యచైతన్యానికి ప్రతిరూపం.

దీపం జ్యోతి పరబ్రహ్మ

దీపం జ్యోతి జనార్దనః

దీపోన హరతు మే పాపం

సంధ్యా దీపం నమోస్తుతే!

అనే శ్లోకాన్ని పఠిస్తూ దీపావళి నాటి సాయంత్రం దీపాలు వెలిగించాలి. అన్ని పండుగలు సాయంత్రానికి ముగిస్తే దీపావళి సంబరాలు మాత్రం సాయంత్రం తర్వాతే మొదలవుతాయి.

దీపావళి రోజు లక్ష్మి పూజ ఎందుకు?

దీపావళి రోజు లక్ష్మీపూజ చేయడం వెనుక అనేక పౌరాణిక గాథలున్నాయి. పాలసముద్రం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవి భూమి మీద సంపద అభివృద్ధి చేయడానికి కారణం కాబట్టి దీపావళి రోజు లక్ష్మీపూజ చేయడం సంప్రదాయంగా మారిందని పద్మపురాణంలో వివరించి ఉంది.

లక్ష్మీదేవిని బంధించిన బలి చక్రవర్తి

సనత్కుమార సంహితలో వివరించిన మరో కథనం ప్రకారం దైత్యులకు రాజైన బలి చక్రవర్తి సమస్త భూమండలాన్ని తన అధీనంలో ఉంచుకుని, లక్ష్మీదేవిని కూడా కారాగారంలో బంధించాడంట! లక్ష్మీదేవి బందీ కావడంతో లోకాలన్నీ దరిద్రంతో నిండిపోయాయి.

లక్ష్మీదేవికి విడుదల

లక్ష్మీదేవి లేక ప్రజలు దరిద్రంతో అల్లాడిపోవడంతో దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళలోకానికి అణిచివేసి, సమస్త దేవతలతో పాటు తన ధర్మపత్ని శ్రీలక్ష్మిని కూడా బందిఖానా నుంచి విడిపించాడు. లక్ష్మీదేవి బందిఖానా నుంచి విడుదల అయింది ఆశ్వయుజ అమావాస్య రోజు కాబట్టి దేవతలంతా లక్ష్మీదేవిని స్తుతిస్తూ దీపాలు వెలిగిస్తారు. దీపం ప్రకాశించే ప్రదేశం లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రదేశం కాబట్టి ఇదే కాలక్రమేణా దీపావళి పండుగగా మారిందని, ఈ రోజున లక్ష్మీదేవికి దీపాలతో స్వాగతం పలికే సంప్రదాయంగా మారిందని విశ్వాసం.

దీపమే లక్ష్మి స్వరూపం

దీపాన్ని లక్ష్మీస్వరూపంగా భావించి పూజించడం హిందూ సంప్రదాయం. ‘లక్ష్మి’ అనే నామానికి కాంతి, శోభ, కళ, ఐశ్వర్యం అనే అర్థాలున్నాయి. ఈ నాలుగింటి సమాహారం స్వరూపమైన లక్ష్మీదేవిని ఆరాధించే పండుగే దీపావళి. వైదిక మహర్షులు రచించిన శ్రీసూక్తం ప్రకారం లక్ష్మీదేవి సుఖాలకు అలవాలమని తెలుస్తోంది. అందుకే దీపావళి రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు.

ధనలక్ష్మి పూజ ఇందుకే!

దీపావళి రోజు ధనలక్ష్మిని పూజిస్తే దారిద్య్రం నుంచి ఉపశమనం కలుగుతుంది. లక్ష్మి ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుంది. ఏడాది మొత్తం ధనానికి లోటు లేకుండా ఉండాలని దీపావళి రోజు ధనలక్ష్మిని పూజిస్తారు.

ధనలక్ష్మి స్థిర నివాసం ఉండాలంటే!

దీపావళి రోజు ధనలక్ష్మిని పూజిస్తే సరిపోదు! ధనలక్ష్మి స్థిరంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నచోటే ధనలక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. పరిశుభ్రమైన చోట, అతిథులకు ఆదరణ ఉన్న చోట, సత్యాన్ని పలికే చోట, ధర్మానికి పెద్ద పీట వేసే చోట, కలహాలు లేని ఇంట మాత్రమే ధనలక్ష్మి స్థిరంగా నివసిస్తుంది. అలాగే గోమాతను పూజించే ఇంట, తులసిని పూజించే ఇంట కూడా లక్ష్మీదేవి నివసిస్తుంది.

లక్ష్మీదేవి కృపతోనే ఇవి సాధ్యం!

శ్రీదేవి కరుణ పరిపూర్ణంగా ఉంటే ధనం, పదవి, ఐశ్వర్యం, కీర్తి, సంతానం కలుగుతాయని విశ్వాసం. ఈ దీపావళి రోజు మనం కూడా లక్ష్మీదేవిని పూజిద్దాం. దీపలక్ష్మీని స్వాగతిద్దాం. అష్టైశ్వర్యాలు పొందుదాం. – ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *