చైనాపై సుంకాలవెనక్కి తగ్గిన ట్రంప్
చైనాపై ఇటీవల వంద శాతం సుంకాలు విధించి షాక్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. చైనాపై విధించిన సుంకాలు శాశ్వాతం కాదన్నారు. చైనా చర్యల వలనే వారిపై అధిక సుంకాలను విధించాల్సి వచ్చిందన్నారు. ఆ సుంకాలు స్థిరంగా అలాగే కొనసాగుతాయని చెప్పడం లేదన్నారు. తాను సుంకాలు విధించేలా చైనా వ్యవహరించిందని చెప్పుకొచ్చారు.
ఫాక్స్ న్యూస్ ఛానెల్‌కు ట్రంప్ ఆదివారం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో చైనాపై సుంకాల గురించి ట్రంప్‌నకు ప్రశ్న ఎదురైంది. దీనికి ట్రంప్ స్పందిస్తూ.. ‘ఆ సుంకాలు శాశ్వతం కాదు. మరో రెండు వారాల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం అవుతా. అప్పుడు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, సుంకాలపై ఓ స్పష్టత వచ్చే వీలుంది. మా మాధ్య చర్చలు సజావుగానే సాగుతాయని ఆశిస్తున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు (Trump Beijing negotiations).
చైనా ఎప్పుడూ అమెరికాపై ఆధిపత్యం కోసమే చూస్తుందని, భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది తనకేమీ తెలియదని ట్రంప్ పేర్కొన్నారు (Trump policy on China). అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతిని చైనా ఇటీవలి కాలంలో తగ్గించింది. చైనా అలా చేయడం ట్రంప్‌నకు ఆగ్రహం తెప్పించింది. దాంతో చైనాపై వంద శాతం సుంకాలను విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆధిపత్యంతో ప్రపంచ దేశాలను కట్టడి చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోందని విమర్శించింది.
