అయోధ్యలో కళ్లు చెదిరిపోయేలా దీపోత్సవం
దీపావళి పండుగ సందర్భంగా అయోధ్య దీపాలతో వెలిగిపోయింది.. అంతేకాకుండా… రెండు ప్రపంచ రికార్డులను కైవసం చేసుకుంది. సరయూ ఘాట్స్‌లో ఏకంగా 26 లక్షల దీపాలను వెలిగించారు. ఈ దీపోత్సవం గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. 56 ఘాట్లలో ఏకంగా 26లక్షల 11వేల 101 దీపాలను వెలిగించి సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించారు. అలాగే 2,100 మందితో సరయూ నదీ తీరాన మహా హారతి నిర్వహించి మరో గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు, వలంటీర్లు పాల్గొన్నారు. మొత్తంగా అయోధ్యలో వెలుగుల పండుగ శోభాయమానంగా జరిగింది.
దీపోత్సవం సందర్భంగా సరయూ నదీ తీరంలోని ఘాట్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. రామ్‌లీలా ప్రదర్శనలు, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రామ్ కీ పైడీ ఘాట్ దగ్గర CM యోగి ఆదిత్యనాథ్ స్వయంగా హారతిని నిర్వహించి రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వేషధారణలో కళాకారులు రథాన్ని లాగుతూ దీపోత్సవానికి శ్రీకారం చుట్టారు. భక్తుల సందడి, దీపాల కాంతితో కనిపించిన ఆ భవ్య దృశ్యం ఆకట్టుకుంది. రామజన్మభూమి ప్రాంగణం నుంచి సరయూ తీరం వరకు వెలుగుల హారం.. భారత సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచింది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, సాంకేతికతల మేళవింపుతో అంగరంగ వైభవంగా 9వ దీపోత్సవం జరిగింది.
రెండు కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డులు
దీపోత్సవ్ సందర్భంగా యుపి ప్రభుత్వం రెండు కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్లను సృష్టించడం గురించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ రిచర్డ్ స్టెన్నింగ్ మీడియాతో మాట్లాడారు.. “ఈ రోజు మనం అద్భుతమైన ప్రదర్శనను చూశాము. 26,17,215 నూనె దీపాలు, ఇది అధికారికంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్. ప్రతి సంవత్సరం, ఇది మరింత పెరుగుతోంది. ఇక్కడ ఉండటం గౌరవంగా ఉంది.. ఇది నిజంగా ఒక గొప్ప సంఘటన..’’ అంటూ పేర్కొన్నారు.
అద్భుతమైన విషయం..
“ఇది ఒక గొప్ప దీపోత్సవం. ఇది చాలా సంవత్సరాలు గుర్తుండిపోతుంది. ఇక్కడ 26,17,215 దీపాలు వెలిగించబడ్డాయి. ఇది ప్రపంచంలోనే అత్యధికం. మేము దీనిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌తో ధృవీకరించాము. ఇది విజయవంతం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది…” అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారి నిశ్చల్ బరోట్ మీడియాకి తెలిపారు.
