రూ.8 వేలకే విజయవాడ-సింగపూర్ ఫ్లైట్ సర్వీస్ !
Vijayawada-Singapore
విమాన ప్రయాణాలు చేసే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. విజయవాడ-సింగపూర్ మార్గంలో నవంబర్ 15 నుంచి ఇండిగో సంస్థ తన కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సర్వీసును ప్రారంభించనుంది. ఈ సర్వీస్ మొదలైతే విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఊరట లభించనుంది. హైదరాబాద్ లేదా చెన్నై మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా విజయవాడ నుంచే డైరెక్ట్ గా ప్రయాణించవచ్చు. ఇక ఫ్లైట్ టికెట్ ధర కేవలం రూ.8 వేలు మాత్రమే కావడం విశేషం. సాధారణంగా సింగపూర్ కు ప్రయాణించాలంటే… కనీసం రూ.15 నుంచి 20 వేలు వరకు ఖర్చవుతుంది. ఈ సర్వీసుతో కేవలం రూ.8 వేలకు ప్రయాణం అందుబాటులో ఉంటుంది.
సింగపూర్ నుంచి బయలుదేరే విమానం ఉదయం 7.45 గంటలకు విజయవాడ ఇంటర్నేషనర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటుందని ఇండిగో సంస్థ తెలిపింది. తిరిగి ఇక్కడి నుంచి ఉదయం 10.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు సింగపూర్ చాంగి విమానాశ్రయానికి చేరుకుంటుందని వివరించింది. సుమారు నాలుగు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుందని తెలిపింది. విజయవాడ నుంచి ప్రయాణం… అందులోనూ సౌకర్యవంతమైన సమయాలు, తక్కువ టికెట్ ధర కావడంతో వ్యాపారవేత్తలు, పర్యాటకులు, విద్యార్థులు అందరికీ ఈ మార్గం అనుకూలంగా మారనుంది. వారానికి మూడు రోజులు(మంగళవారం, గురువారం, శనివారం) ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. 180 నుంచి 230 సీట్లు కలిగిన ఇండిగో బోయింగ్ ఫ్లైట్ లతో సర్వీసులు నడువనున్నాయి. తొలుత వారానికి మూడు సార్లు మాత్రమే నడపాలని నిర్ణయించారు. ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరిగితే రోజువారీ సర్వీసు నడిచేవిధంగా చర్యలు తీసుకుంటామని సంస్థ సిబ్బంది తెలిపారు.
