కర్నూలు జాతీయ రహదారిపై ప్రైవేట్‌ బస్సు దగ్దం !

bus-fire-1

కర్నూలు (Kurnool) జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ (Kaveri travels) బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సును బైక్‌ ఢీకొట్టి ముందుభాగంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి బస్సులోనే పలువురు సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది వరకు ఉన్నట్లు సమాచారం. 12 మంది వరకు స్వల్ప గాయాలతో బయటపడినట్లు, 20 మందికి పైగా మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

హైదరాబాద్ (Hyderabad) నుంచి వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు నగర శివారులో ఉలిందకొండ సమీపంలోకి రాగానే వెనక నుంచి వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఆ బైకు బస్సు కిందికి వెళ్లి ఇంధన ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు అంతా మంటలు వ్యాప్తిచెందాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా, పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు.. పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే ఇద్దరు డ్రైవర్లు పరారీ అయ్యారు.

ప్రాణాలతో బయటపడిన వారు వీరే

ప్రమాదం నుంచి రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్‌, అఖిల్‌, జష్మిత, అకీర, రమేష్‌, జయసూర్య, సుబ్రహ్మణ్యం బయటపడ్డారు. హిందూపూర్‌కు చెందిన నవీన్‌ బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని ఆరుగురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న హైమ రెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి ఆగారు. పోలీసులకు ఆమె సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

బస్సు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడి… అందుకు అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఈ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఉన్నతాధికారులతో సమీక్షించారు. సహాయక చర్యల్లో భాగంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలంటూ గద్వాల్ జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్పీలను సీఎం ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించింది.

స్పందించిన కేటీఆర్

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 20 మంది దుర్మరణం చెందడం తనను కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నానన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరక తన ఎక్స్ ఖాతా వేదికగా కేటీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *