‘ఆసియాన్‌’ సదస్సుకు వర్చువల్‌ గా హాజరుకానున్న ప్రధాని మోదీ

0602c35ee98e4574c92d6508b1f3e53f68f8cb5e5e33a

మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఈ నెల 26 నుంచి 28వ తేదీ దాకా జరుగనున్న అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ఈస్ట్‌ ఆసియన్‌ నేషన్స్‌(ఆసియాన్‌) 22వ శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) వర్చువల్‌ గా హాజరుకానున్నారు. ఆయన గురువారం మలేషియా ప్రధానమంత్రి అన్వర్‌ ఇబ్రహీంతో ఫోన్‌లో మాట్లాడారు. ఆసియాన్‌ సదస్సుకు స్వయంగా హాజరుకాలేనని, వర్చువల్‌గా ప్రసంగిస్తానని తెలియజేశారు. ‘‘నా మిత్రుడు అన్వర్‌ ఇబ్రహీంతో చక్కటి సంభాషణ జరిగింది. ఆసియాన్‌కు సారథ్యం వహిస్తున్నందుకు ఆయనకు అభినందనలు తెలియజేశా. వచ్చేవారం జరిగే సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ఈ సదస్సులో వర్చువల్‌గా పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఆసియాన్‌–ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలన్నదే నా ఆకాంక్ష’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు.

అయితే షెడ్యూలింగ్‌ సమస్య వల్లే మోదీ ఆసియాన్‌ సదస్సుకు వెళ్లలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు బదులు ఈ సదస్సులో విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం హాజరు కాబోతున్నారు. మలేషియాలో మోదీ, ట్రంప్‌ ప్రత్యేకంగా సమావేశమవుతారని తొలుత ప్రచారం జరిగింది. మోదీ గైర్హాజరు కానుండడంతో ఈ భేటీ లేనట్లే. అలాగే మోదీ మలేషియాకు వెళ్లడం లేదు కాబట్టి కాంబోడియా పర్యటన కూడా వాయిదా పడినట్లేనని స్పష్టమవుతోంది.

ఆసియాన్‌ 1967 ఆగస్టు 8న ఐదు దేశాలతో ఏర్పాటయ్యింది. ప్రస్తుతం ఈ కూటమిలో ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా దేశాలకు సభ్యత్వం ఉంది. ఆసియాన్‌–భారత్‌ మధ్య 1992లో భాగస్వామ్యం మొదలయ్యింది. 1995 డిసెంబర్‌లో పూర్తిస్థాయి భాగస్వామ్యంగా, 2002లో శిఖరాగ్ర స్థాయి భాగస్వామ్యంగా, 2012లో వ్యూహాత్మక భాగస్వామ్యంగా సంబంధాలు బలపడ్డాయి. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ తదితర రంగాల్లో ఇరుపక్షాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి.

ట్రంప్‌ నుంచి తప్పించుకోవడానికే మోదీ వెళ్లడం లేదు – కాంగ్రెస్‌

ఆసియాన్‌ సదస్సుకు స్వయంగా హాజరుకాకూడదని, వర్చువల్‌గా ప్రసంగించాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ గురువారం ‘ఎక్స్‌’లో తప్పుపట్టారు. మోదీ కౌలాలంపూర్‌కు వెళ్లకపోవడానికి అసలు కారణం వేరే ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఎదురుపడకుండా తప్పించుకోవడానికే మోదీ ఆసియాన్‌ సదస్సుకు దూరంగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపేశానంటూ ట్రంప్‌ ఇప్పటిదాకా 53 సార్లు చెప్పారని అన్నారు. అలాగే రష్యా నుంచి భారత్‌ ముడి చమురు కొనుగోలు చేయదనిమోదీ హామీ ఇచ్చారంటూ కూడా ఐదుసార్లు చెప్పారని గుర్తుచేశారు. ట్రంప్‌ ప్రకటనలను మోదీ కనీసం ఖండించలేదని ఆరోపించారు. పైగా ట్రంప్‌ను ప్రశంసిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారని మండిపడ్డారు. ట్రంప్‌ను స్వయంగా కలిసి మాట్లాడే ధైర్యం మన ప్రధానమంత్రికి లేదని జైరామ్‌ రమేశ్‌ ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *