బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు – మంత్రి పార్థసారథి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) పై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. జగన్ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీకి రాకుండా బాలకృష్ణ గురించి మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. సహచర శాసనసభ్యుడు గురించి జగన్ ఇష్టానుసారంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని సూచించారు. బాలకృష్ణ గురించి అభ్యతరకరంగా జగన్ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు.
విశాఖపట్నంలో డేటా సెంటర్ ఎవరూ తెచ్చారో ప్రజలకు తెలుసునని అన్నారు. 2020లో అదానీ… డేటా సెంటర్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఏపీకి రాకుండా అదానీ కంపెనీ పారిపోయిందని విమర్శించారు. జగన్ హయాంలో ఎందుకు డేటా సెంటర్ పెట్టలేదని నిలదీశారు. ఇవాళ(శుక్రవారం) ఏపీ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడారు.
గత జగన్ ప్రభుత్వం పేదలకి సెంటు భూమి ఇచ్చిందని.. కానీ అవి నివాస యోగ్యానికి పనికి రానివని మంత్రి పార్థ సారథి ఫైర్ అయ్యారు. లే అవుట్లు ప్రారంభం కాని చోట వాటిని రద్దు చేసి 2, 3 సెంట్లని తమ ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. ఇంకా నిర్మాణం పూర్తి చేసుకొని చోట ఉన్నవారికి 2,3 సెంట్లు కేటాయించాలని నిర్ణయించామని వివరించారు. ఈ ప్రక్రియని మరోసారి ముందుకు తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే విషయంపై కూడా చర్చించామని అన్నారు. ఈ విషయంలో నెలకొన్న సమస్యలని అధిగమించి ముందుకెళ్తామని మంత్రి పార్థ సారథి పేర్కొన్నారు.
