ఒకే గుడిలో రెండు రూపాల్లో కృష్ణుడి దర్శనం
రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో 500 ఏళ్ల క్రితం నాగ సాధువులు నిర్మించిన బ్రజ్‌లౌతా ఆలయంలోని రెండు శ్రీకృష్ణుడి విగ్రహాలు చూపరులను ఆకట్టుకుంటాయి. ఈ గుడిలోని ఓ విగ్రహం కన్నయ్య వేణువు పట్టుకున్న రూపంలో ఉంటుంది. కర్ర చేత పట్టుకున్నట్లు మరో ప్రతిమ దర్శనమిస్తుంది. ఈ ఆలయ చరిత్ర శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన లీలతో ముడిపడి ఉంది. ‘‘ఇంద్రుడికి గర్వ భంగం చేయడానికి శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధన గిరి కింద బ్రజ్ ప్రజలు ఏడు రోజులు సురక్షితంగా ఉన్నారు. ఇంద్రుడికి కోపం తగ్గిన తర్వాత కృష్ణుడు కర్ర పట్టుకుని ప్రజలకు కనిపించాడు. దీంతో అప్పటి నుంచి బ్రజ్ ప్రజలు కన్నయ్యను రెండు రూపాల్లో పూజించడం ప్రారంభించారు’’ అని చెబుతారు. ఈ గుడిలో ఉన్న ఒక కృష్ణుడి రూపం ప్రజలను రక్షించేదిగా, మరొక రూపం ఆనందాన్ని ప్రసాదించేదిగా భక్తులు భావిస్తారు.
