కాంగ్రెస్‌ మాఫియా రాజ్యం – కేటీఆర్

1956699-photo-2025-09-10-15-44-01

సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం అవినీతి, భూఆక్రమణలు, సెటిల్మెంట్లకు కేంద్రంగా మారిపోయిందంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం మాఫియా రాజ్యంగా మారిందని, సీఎం రూ.వేల కోట్లు పోగేసుకుంటుంటే తాము వందల కోట్లయినా సంపాదించొద్దా… అంటూ మంత్రులు పోటీ పడుతున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌ యూత్‌ కరేజ్‌ వ్యవస్థాపకుడు, సామాజిక కార్యకర్త సల్మాన్‌ఖాన్‌ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ దేశంలో కేసీఆర్‌లాంటి సెక్యులర్‌ నేత ఎవరూ లేరని ప్రశంసించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోందని, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఇదేతీరు కొనసాగుతోందన్నారు. మంత్రుల మధ్య అవినీతి సొమ్ముల పంపకాలు, టెండర్ల రిగ్గింగ్‌ వంటివి.. కాంగ్రెస్‌ ఇంటి పంచాయితీలుగా మారాయన్నారు. ఇంత బహిరంగంగా దేశచరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు.

పొంగులేటి తమ టెండర్లలో తలదూర్చారని ఓ మంత్రి కుమార్తె ఆరోపించారని అన్నారు. ముఖ్యమంత్రి ప్రోద్బలంతో ఆయన అనుచరుడు రోహిన్‌రెడ్డి ఓ పారిశ్రామికవేత్త నెత్తిన గన్నుపెట్టి బెదిరించారంటూ ఆమె చేసిన ఆరోపణలపై రేవంత్‌రెడ్డికి సిగ్గుంటే స్పందించాలన్నారు. మంత్రి కూతురు ఆరోపణలుచేస్తే ఆ మంత్రిని తొలగించలేని బలహీనమైన ఇలాంటి సీఎంను ఇప్పటివరకు చూడలేదన్నారు. దావూద్‌ ఇబ్రహీంలాంటి ఈ సీఎంను తరిమేస్తేనే తెలంగాణకు పట్టిన శని పోతుందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. భాగస్వాములైతే, గతంలో మాదిరిగానే జైలుకు వెళ్లాల్సివస్తుందని అధికారులను హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *