కాంగ్రెస్ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం – కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కూడా గడవకుండానే… ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. పల్లెల్లోని రైతులే కాదు… హైదరాబాద్ ప్రజలు సైతం చేతుల్లో పైసలు ఆడక పరేషాన్లో పడ్డారని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యవస్థ కుప్పకూలిందని, అసమర్థ పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన భారత రాష్ట్ర సమితి సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, సునీతా లక్ష్మారెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారం తీరుతెన్నులపై కేసీఆర్‌కు పార్టీ ఇన్‌ఛార్జులు నివేదించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… ‘‘కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చి అమలు చేయడంలేదని, నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని బాధపడుతున్న సమయంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ప్రజలు విజ్ఞులు. చాలా స్పష్టతతో ఉన్నారు. జూబ్లీహిల్స్‌లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గెలుపును ఎప్పుడో ఖరారు చేశారు. భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు చేయాల్సిందల్లా… అత్యధిక మెజారిటీ కోసం ప్రజలతో కలిసి పనిచేయడమే. ఇంటింటికీ వెళ్లి.. సర్కారు వైఫల్యాల గురించి కాంగ్రెస్ బాకీ కార్డు చూపిస్తూ వివరించి చెప్పండి’’ అని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో మానవీయ కోణంలో పథకాల అమలు
‘‘భారత రాష్ట్ర సమితి హయాంలో ప్రతి పథకాన్ని మానవీయ కోణంలో రూపొందించి అమలు చేశాం. కేసీఆర్ కిట్‌ను, గొర్రెలు, చేపల పంపిణీ పథకాలను తీసుకొచ్చాం. మిషన్ భగీరథ ద్వారా మారుమూల గ్రామాలకు, తండాలకు కూడా తాగునీరు అందించాం. బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి బస్తీవాసులకు వైద్యాన్ని చేరువ చేశాం. రెసిడెన్షియల్ స్కూళ్లు స్థాపించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్య అందించాం. మహిళా డిగ్రీ కాలేజీలు నెలకొల్పాం. కరోనా కష్టకాలంలోనూ పింఛన్లు ఇచ్చాం.
పెద్దనోట్ల రద్దు వంటి ఆర్థిక సంక్షోభాన్ని కూడా తట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం. అన్ని రంగాలపై ప్రత్యేక దృష్టి సారించడం వల్లనే.. ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఏటా 10-15 శాతం పెరగాల్సిన ఆదాయం ఇప్పుడు కాంగ్రెస్ పాలన వల్ల మైనస్‌లోకి వెళ్లిపోతోంది. పదేళ్లపాటు అన్ని రంగాలు పురోభివృద్ధి సాధిస్తే… ఇప్పుడు అవి నిర్వీర్యమవడం బాధాకరంగా ఉంది. గడిచిన రెండేళ్లలో ఆర్థిక వృద్ధిలో తెలంగాణ చివరి స్థానంలో ఉన్నట్లు నివేదికలు వస్తోంటే… కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. భారత రాష్ట్ర సమితి హయాంలో తెచ్చిన పథకాలను ఎందుకు అమలు చేయడం లేదో కాంగ్రెస్‌ను నిలదీయాలి.
