కరూర్ తొక్కిసలాట కేసులో రంగంలోనికి దిగిన సీబీఐ
Andhragazette - Karur Stampede
Karur Stampede: తమిళనాడులోని కరూర్‌లో టీవీకే ప్రచార సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట కేసు దర్యాప్తును సీబీఐ అధికారికంగా తన చేతుల్లోకి తీసుకుంది. నిబంధనల ప్రకారం… రాష్ట్ర పోలీసుల ‘ఎఫ్ఐఆర్’ను తిరిగి నమోదు (రీ-రిజిస్టర్) చేసింది. స్థానిక కోర్టుకు ఈమేరకు సమాచారం అందజేసింది. టీవీకే జనరల్ సెక్రటరీ బస్సీ ఆనంద్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నిర్మల్ కుమార్ తదితరుల పేర్లను అందులో చేర్చింది. త్వరలో అరెస్టులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఐజీ ఆశా గార్గ్ నేతృత్వంలోని సిట్ తొలుత దర్యాప్తు చేపట్టింది. దీనిని సవాల్ చేస్తూ.. టీవీకే సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమిళనాడు పోలీసులు మాత్రమే ఉన్న సిట్‌పై నమ్మకం లేదని, సీబీఐ (CBI) దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు పర్యవేక్షణకు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరింది.
దీన్ని విచారించిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం.. దర్యాప్తు బాధ్యతలను ‘సీబీఐ’కి అప్పగిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే సీబీఐ బృందం ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. కరూర్‌లోని ఘటన స్థలాన్ని పరిశీలించింది. బాధితులు, సంబంధిత కుటుంబాల వాంగ్మూలాలను సేకరించింది.
గత నెల 27న టీవీకే పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ (Vijay) కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా.. 60 మందికిపైగా గాయపడ్డారు. బాధిత కుటుంబాలను విజయ్ కలవనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్ 27న చెన్నై సమీపంలోని ఓ రిసార్టులో వారిని పరామర్శించనున్నట్లు తెలిపాయి. దీనికోసం రిసార్టులో టీవీకే పార్టీ 50 గదులను బుక్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Also Read: జేడీయూకు ‘రెబల్స్’ ట్రబుల్
