వికాసానికి, వినాశనానికి మధ్య పోరు బిహార్ ఎన్నికలు – నడ్డా

2-57

బిహార్‌ ఎన్నికలు ఎన్డీయే వికాసానికి, ఇండియా కూటమి వినాశనానికి మధ్య జరుగుతున్న పోరని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. భాగస్వామ్య పక్షాలను అంతం చేసే పరాన్నజీవి పార్టీ అంటూ కాంగ్రెస్‌ పై విరుచుకుపడ్డారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav) నేతృత్వంలోని ఆర్జేడీ… రంగ్‌దారీ (దోపిడీ), జంగల్‌రాజ్‌ (ఆటవిక పాలన), దాదాగిరీ (దౌర్జన్యం)లకు ప్రతీక అని విమర్శించారు. బిహార్‌లోని ఔరంగాబాద్‌లో గురువారం ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. ఆర్జేడీ చీకటి యుగం గురించి తనకు తెలుసని అన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తామని, వలసలను అడ్డుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఇచ్చిన హామీలు.. ‘భూమికి ఉద్యోగం కుంభకోణం’లో ఆర్జేడీ ప్రమేయాన్ని గుర్తుచేస్తున్నాయన్నారు. బిహార్‌లో మహిళల కోసం పనిచేస్తున్నదెవరో ఓటర్లకు తెలుసునని, వారిని తప్పుదారి పట్టించేందుకు తేజస్వి చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని సీఎం నీతీశ్‌కుమార్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు దానిని సొంత ప్రయోజనాలకే వాడుకున్నారని విమర్శించారు.

ప్రజాస్వామ్యంలో చీకటిరోజే – సామ్రాట్‌ చౌధరీ

ఎన్నో కేసులున్న లాలూప్రసాద్‌ తనయుడిని ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ప్రజాస్వామ్యంలో చీకటిరోజు అని బిహార్‌ ఉపముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌధరీ విమర్శించారు. పోటీ అభ్యర్థుల్ని నిలిపి కాంగ్రెస్‌ సహా ఇండియా కూటమి పార్టీలను లాలూ వేధిస్తున్నారని విలేకరుల సమావేశంలో ఆరోపించారు. తేజస్వి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే రూ.17 లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇది రాష్ట్ర బడ్జెట్‌ కంటే ఆరురెట్లు ఎక్కువని చెప్పారు.

ప్రజాభిప్రాయం మారదు – ప్రశాంత్‌

సీవాన్‌: ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ను సీఎం అభ్యర్థిగా ఇండియా కూటమి ప్రకటించినంతమాత్రాన ప్రజాభిప్రాయం ఆ కూటమికి అనుకూలంగా మారదని జన్‌సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన గురువారం సీవాన్‌లో విలేకరులతో మాట్లాడారు. తేజస్వి సీఎం అయితే లాలూ ఆటవిక పాలన మళ్లీ వస్తుందని చెప్పారు. ఈసారి గెలవబోయేది జన్‌సురాజ్‌ పార్టీయేనని, ఆర్జేడీ ఏలుబడిలో బిహార్‌ ఎంత దారుణంగా ఉండేదో ప్రజలకు గుర్తుందని అన్నారు.

Read Also: మహాగఠ్‌బంధన్‌ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *