వైద్యురాలి ఆత్మహత్యపై సీఎం ఫడణవీస్‌ కీలక వ్యాఖ్యలు

Andhragazette - CM Devendra Fadnavis

Andhragazette - CM Devendra Fadnavis

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో వైద్యురాలి ఆత్మహత్య ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) స్పందించారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు తాను విశ్రమించబోనన్నారు. సతారాలోని ఫాల్టాన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి తనను రాకుండా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. మాజీ ఎంపీ రంజిత్‌ సిన్హ్‌ నాయక్‌ నింబాల్కర్‌, ఎమ్మెల్యే సచిన్‌ పాటిల్‌ పేర్లు ఈ కేసుతో ముడిపడి ఉన్నాయన్న ఆయన.. వైద్యురాలి మృతి కేసును రాజకీయం చేసే ప్రయత్నాలను సహించబోనన్నారు. మరోవైపు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సైతం ఈ కేసుపై తీవ్రంగానే స్పందించారు. వైద్యురాలి ఆత్మహత్యను ‘సంస్థాగత హత్య’గా అభివర్ణించారు. భాజాపా సారథ్యంలోని ప్రభుత్వ అమానవీయతను ఈ ఘటన బయటపెడుతోందని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో బాధితురాలిని తన సోదరిగా పేర్కొన్న సీఎం దేవేంద్ర ఫడణవీస్‌.. ఆమె ఆత్మహత్య విషాదకరం, దురదృష్టకరమన్నారు. ఆమెకు న్యాయం జరిగేలా చూడటంలో రాజీపడేది లేదని పునరుద్ఘాటించారు. బాధితురాలు తన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్న ఇద్దరు వ్యక్తులనూ అరెస్టు చేసినట్లు చెప్పారు. బీడ్‌కు చెందిన వైద్యురాలు గురువారం రాత్రి ఫాల్టాన్‌ పట్టణంలోని ఓ హోటల్‌ గదిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమె రాసిన సూసైడ్‌ లేఖలో ఎస్సై గోపాల్‌ బదానే తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, ప్రశాంత్‌ బన్కర్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మానసికంగా వేధించాడని పేర్కొన్నారు. దీంతో వీరిద్దరినీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు వైద్యురాలు పలుమార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని ఆమె తరఫు బందువు ఒకరు తెలిపారు. బాధితురాలు పనిచేస్తున్న సబ్‌ డిస్ట్రిక్ట్‌ ఆస్పత్రిలో మెడికల్‌ రిపోర్టులను మార్చాలంటూ ఒత్తిడి చేశారని మరో బంధువు ఆరోపించారు. మరోవైపు, భాజపా మాజీ ఎంపీ రంజిత్‌సింగ్‌ నాయక్‌ నింబాల్కర్‌ గతంలో ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారని శివసేన యూబీటీ నేత అంబాదాస్‌ దాన్వే ఆరోపించారు. అయితే, దీనిపై స్పందించిన నింబాల్కర్‌.. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. కావాలనే ఈ కేసులోకి తన పేరును లాగుతున్నారన్నారు.

వైద్యురాలి ఆత్మహత్యపై రాహుల్‌ గాంధీ ఆవేదన

ఓ ఎస్సై తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ… మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఓ వైద్యురాలు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) స్పందిస్తూ… మహారాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులే నేరస్థులను రక్షిస్తుంటే… బాధితులు ఇక న్యాయాన్ని ఎలా ఆశిస్తారని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే దారుణాలకు పాల్పడితే వారు ఇంకెవరిని ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. వైద్యురాలి ఆత్మహత్యను ప్రభుత్వ హత్యగా అభివర్ణించారు. న్యాయంకోసం పోరాటంలో మృతురాలి కుటుంబసభ్యులకు తాము మద్దతుగా నిలబడతామన్నారు.

వైద్య పరీక్షలకు తీసుకురాకుండానే నిందితులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ చేయాలంటూ పోలీసులు, అధికారులు, ఎంపీ వైద్యురాలిని బెదిరించడం వంటి చర్యలు అక్కడి ప్రభుత్వ వ్యవస్థలోని అవినీతికి నిదర్శమని రాహుల్‌ అన్నారు. అటువంటి నేరస్థులు పెట్టిన హింసలకు వైద్యురాలు బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపాతో సంబంధమున్న కొందరు వ్యక్తులు కూడా అవినీతికి పాల్పడాలని వైద్యురాలిని బెదిరించారన్నారు.

ఆత్మహత్యకు ముందు 26 ఏళ్ల వైద్యురాలు రాసిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు శనివారం నిందితులు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ప్రశాంత్‌ బంకర్‌, ఎస్సై గోపాల్‌ బదానేలను అరెస్టు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు, బాధితురాలు ఇద్దరూ బంధువులేనని దర్యాప్తులో తేలిందని అధికారి ఒకరు తెలిపారు. ఎంపీపై ఆమె చేసిన ఆరోపణలపై విచారణ కొనససాగుతోందన్నారు. కాగా ఈ ఆత్మహత్య మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

గురువారం రాత్రి సతారాలోని ఒక హోటల్ గదిలో ఒక మహిళా డాక్టర్ ఉరి వేసుకున్నారు. ఆమె స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. ఫల్తాన్ సిటీ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ బదానే తనపై నాలుగుసార్లు అత్యాచారం చేశాడని, ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్ వేధింపులకు గురి చేశాడని ఆమె సూసైడ్‌ లేఖలో రాశారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తు​న్నారు.

Also Read: బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *